అప్పుడు సినిమాలు చేయకూడదనుకున్నా

20 Jul, 2018 02:29 IST|Sakshi
∙ఉదయ్‌ శంకర్, చంద్రసిద్ధార్థ్, దొడ్డన్న, రాక్‌లైన్‌ వెంకటేశ్, ఆది

చంద్రసిద్ధార్థ్‌

‘‘చాలా గ్యాప్‌ తర్వాత మీ ముందుకొస్తున్నా. సరైన కథ తోచక నిరాసక్తతలో ఉండి ఇక సినిమాలు చేయకపోవడమే బెటర్‌ అనుకుంటున్న టైమ్‌లో తనికెళ్ల భరణిగారు రాసిన ‘ఆటగదరా శివ’ పాట విన్నా. అది టైటిల్‌గా బావుంటుందనిపించింది. ఆ మరుసటిరోజే రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారు ‘ఆటగదరా శివ’ సినిమా గురించి చెప్పారు. నాకూ రోడ్‌  ఫిల్మ్‌ చేయాలని కోరిక ఉండటంతో ఒప్పుకున్నా’’ అని దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ అన్నారు. ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా దొడ్డన్న, ‘హైపర్‌’ ఆది, దీప్తి, ‘చలాకీ’ చంటి, ‘చమ్మక్‌’ చంద్ర, భద్రం నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’.

‘ఆ నలుగురు’ ఫేమ్‌ చంద్రసిద్ధార్థ్‌ దర్శకత్వంలో రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చంద్రసిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘కన్నడలో హిట్‌ అయిన ‘రామ రామ రే’ చిత్రానికి స్పిరిచ్యువల్‌ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి ‘ఆటగదరా శివ’ కథ సిద్ధం చేశా. పెద్ద పెద్ద సినిమాలు చేసే వెంకటేశ్‌గారు ఈ సినిమా తీయడం ధైర్యం చేయడమే. ఇది రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా కష్టపడ్డారు’’ అన్నారు.

‘‘ఆటగదరా శివ’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వాసుకి సంగీతం బాగుంది. పులగం చిన్నారాయణ, చైతన్యప్రసాద్‌ రాసిన పాటలు బాగున్నాయి’’ అని రాక్‌లైన్‌ వెంకటేశ్‌ అన్నారు.  ‘‘వెంకటేశ్‌గారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. చంద్రసిద్ధార్థ్‌గారి డైరక్షన్‌లో చేయడం హ్యాపీ’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ‘‘ఈ సినిమా కోసం ఆర్నెల్లు గడ్డం పెంచా’’ అన్నారు కన్నడ నటుడు దొడ్డన్న.

మరిన్ని వార్తలు