ప్రెట్టీ ఉమన్’ ప్రేరణతో...

30 Jul, 2013 04:20 IST|Sakshi
ప్రెట్టీ ఉమన్’ ప్రేరణతో...
 ‘‘హాలీవుడ్ చిత్రాల్లో నాకు బాగా నచ్చినవాటిలో ‘ప్రెట్టీ ఉమన్’ ఒకటి. ఆ చిత్రం ఆధారంగా ఈ సినిమా చేశాం. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది. అమ్మాయిలంటే ఆమడ దూరం పారిపోయే కుర్రాడిగా చేశాను. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరుణ్ సందేశ్.
 
  కోనేటి శ్రీను దర్శకత్వంలో వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’. వచ్చే నెల 2న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘ఫైనల్ అవుట్‌పుట్ చూసినవాళ్లందరూ బాగుందన్నారు. 
 
 మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మేం వయసుకు వచ్చాంలాంటి విజయం తర్వాత మేం నిర్మించిన చిత్రం ఇది. వరుణ్, హరిప్రియల పాత్రలు చాలా బాగున్నాయి’’ అని నిర్మాత చెప్పారు. ‘‘అమ్మాయిలంటే భయపడే అబ్బాయి జీవితంలోకి ఓ వేశ్య వస్తే.. అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే కథాంశంతో ఈ చిత్రం చేశాం’’అని దర్శకుడు అన్నారు.
 
>