‘సంజు’ టీంకు షాకిచ్చిన గ్యాంగ్‌స్టర్‌

27 Jul, 2018 10:17 IST|Sakshi
1993 నాటి ముంబై పేలుళ్ల కేసు ప్రధాన నిందితుడు అబూ సలేం

‘సంజు’ నిర్మాతలకు అబూ సలేం లీగల్‌ నోటీసులు

సాక్షి, ముంబై : సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’ . పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే దర్శకుడు తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేం కూడా సంజు మేకర్స్‌కు గట్టి షాక్‌ ఇచ్చాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న సీన్ 15 రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవంటూ’  తన లాయర్‌ ప్రశాంత్‌ పాండే ద్వారా అబూ సలేం ‘సంజు’  నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపించాడు.

సంజయ్‌ దత్‌ను కలవనేలేదు..
‘1993 ముంబై పేలుళ్ కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణ్‌బీర్‌ కపూర్‌ చేత చెప్పించారు. అసలు నా క్లైంట్‌(అబూ సలేం) సంజయ్‌ దత్‌ను ఒక్కసారి కూడా కలవలేదు, ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించిన ఈ సీన్‌ను 15 రోజుల్లోగా తొలగించాలి. అదే విధంగా అబూ సలేంకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’  ప్రశాంత్‌ పాండే నోటీసులో పేర్కొన్నారు. కాగా ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు