భాషను... యాసను మరువకూడదు

10 Jul, 2016 23:40 IST|Sakshi
భాషను... యాసను మరువకూడదు

‘‘కళ అనేది నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉండాలి. కళలు మన సంస్కృతిలో అంతర్భాగం. మన భాషను, యాసను మరువకూడదు’’ అని ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా లండన్‌లో నిర్వహించిన ‘జయతే కూచిపూడి జయతే బతుకమ్మ’ సాంస్కృతిక వేడుకలకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళలు, సంస్కృతి ప్రపంచానికి చేరువ కావడానికి తాను ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ఉండటానికి సిద్ధమే అన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ - ‘‘సినిమాల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తాను. తెలుగునాట వివిధ ప్రాంతాలకు చెందిన జానపద గీతాలు నా సినిమాల్లో ఉండేలా చూసుకుంటాను.

మన సంప్రదాయాల్ని భావితరాలకు చేరువ చేయడంలో ఈ తరహా ఉత్సవాలు ఎంతో సహాయపడతాయి. దీనికి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జానపద నృత్య ప్రదర్శన ఆహూతులను, ప్రేక్షకులను అలరించింది. ఈ వేడుకల్లో పవన్ లుక్ అందర్నీ ఆకర్షించింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఈ లుక్‌తో కనిపిస్తారని సమాచారం.

 

>