‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్’ డైరెక్టర్‌ అరెస్ట్‌

3 Aug, 2018 11:52 IST|Sakshi
‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్’ డైరెక్టర్‌ విజయ్‌ అరెస్ట్‌

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’.. సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వంలో.. బోహ్ర బ్రదర్స్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు విజయ్‌ గట్టీని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ అరెస్ట్‌ చేసింది. 34 కోట్ల రూపాయల జీఎస్టీ మోసానికి పాల్పడినందుకు గాను, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ చెప్పింది. నకిలీ ఇన్‌వాయిస్‌ ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను విజయ్‌ గట్టీ కంపెనీ వీఆర్‌జీ డిజిటల్‌ క్లయిమ్‌ చేసుకుందని పేర్కొంది. రూ.266 కోట్ల విలువైన యానిమేషన్‌, మాన్‌వపర్‌ సర్వీసులను హారిజోన్‌ కంపెనీకి వాడినట్టు వీఆర్‌జీ డిజిటల్‌ నకిలీ ఇన్‌వాయిస్‌ల్లో చూపించింది.

ఇలా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను మోసపూరితంగా వీఆర్‌జీ డిజిటల్‌ పొందింది. హారిజోన్‌ కూడా రూ.170 కోట్ల జీఎస్టీ మోసానికి పాల్పడింది. దీంతో ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ కనుసన్నల్లోకి వచ్చేశాయి. విజయ్‌ను జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ అదుపులోకి తీసుకుంది. విజయ్‌, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారవేత్త రత్నాకర్‌ గట్టీ కొడుకు. విజయ్‌ తండ్రి రత్నాకర్‌ కూడా రూ.5500 కోట్ల ఇంజనీరింగ్‌ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగ, విజయ్‌ తెరకెక్కిస్తున్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ లో క్యారెక్టర్‌లు అన్నీ ఇప్పటికే ఫిక్స్‌ అయిపోయాయి. డిసెంబర్‌ 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర, మన్మోహన్‌ సింగ్‌గా అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు. దివ్యా సేథ్‌, మన్మోహన్‌ భార్య గుర్షరణ్ కౌర్ పాత్రను పోషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు