వర్మ వర్సెస్‌ దేవి

25 Jan, 2018 12:52 IST|Sakshi
రాంగోపాల్‌ వర్మ, సామాజిక కార్యకర్త దేవి

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆర్జీవీపై సీసీఎస్‌ పోలీసులకు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

ఆర్జీవీపై కేసు నమోదు
వర్మపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని దేవి తెలిపారు. చట్టాలను గౌరవించని వ్యక్తులకు ఈ దేశంలో నివసించే హక్కులేదన్నారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను సరుకుగా వర్ణించేవిధంగా వర్మ వ్యాఖ్యలున్నాయని చెప్పారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాంగోపాల్‌ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్నారు.

పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ వెనక్కు తగ్గలేదు. జనవరి 26న ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.

మరిన్ని వార్తలు