‘సంజు’పై ఫిర్యాదు; ఇండియా పరువేంగాను?

12 Jun, 2018 17:10 IST|Sakshi
సంజు ట్రైలర్‌లో సీన్‌

న్యూఢిల్లీ: రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ సినిమాపై ఫిర్యాదు నమోదైంది. ‘సంజు’ ట్రైలర్‌లో చూపించిన ‘జైలు టాయిలెట్‌ లీకేజీ సీన్ల’ను తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు వెళతామని ఫృథ్వీ మస్కే అనే స్వచ్ఛంద కార్యకర్త.. సెన్సార్‌ బోర్డును హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సీబీఎఫ్‌సీ చైర్మన్‌ ప్రసూన్‌ జోషికి ఫిర్యాదును అందజేశారు.

ఇండియా పరువేంగాను?: ‘‘సంజు సినిమా ట్రైలర్‌లో టాయిలెట్‌ లీకేజీ సీన్‌ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సీన్‌ వల్ల ఇండియాలోని జైళ్ల నిర్వహణ, అధికారుల పనితీరుపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో జైల్‌ సీన్లు ఉన్నప్పటికీ, ఇలా టాయిలెట్‌ లీకేజీని చూపించిన దాఖలాలు లేవు. వాస్తవానికి అలాంటి సంఘటనేదీ జరిగినట్లు ఎక్కడా నమోదుకాలేదు’’ అని ఫృథ్వీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు సీన్‌పై సెన్సార్‌ బోర్డు స్పందించకుంటే, సినిమా విడుదల నిలిపేసేలా కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా, ఈ ఫిర్యాదుపై సీబీఎఫ్‌సీ స్పందన ఇంకా వెలువడాల్సిఉంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 29న ‘సంజు’ విడుదలకానుంది.
సంజు ట్రైలర్‌

మరిన్ని వార్తలు