సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

2 Aug, 2019 17:23 IST|Sakshi

సీనియర్‌ నటుడు, రాజీవ్‌ కనకాల తండ్రి దేవదాస్‌ కనకాల(74) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవదాస్‌ కనకాల.. శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. గతేడాది ఫిబ్రవరిలో దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీ దేవి కనకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన తొలితరం నటుల్లో దేవదాస్‌ కనకాల ఒకరు. దేవదాస్‌ కనకాల హైదరాబాద్‌లో యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పి ఈ తరం వారకి నటనలో శిక్షణ ఇస్తున్నారు.చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖ నటుల చేత ఒకప్పుడు దేవదాస్‌ కనకాల నటనలో ఓనమాలు దిద్దించారు.

దేవదాస్‌ కనకాల 1945లో జూలై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ. దేవదాస్‌ కనకాలకు ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టీవీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావుతో జరిగింది.

చలి చీమలు, నాగమల్లి వంటి చిత్రాలకు దేవదాస్‌ కనకాల దర్శకత్వం వహించారు. ఓ సీత కథ, భలే దంపతులు, మనసంతా నువ్వే, శ్రీరామ్‌, పెదబాబు, అమ్మో ఒకటో తారీఖు, సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్‌ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్‌ కనకాల నటించారు. భరత్‌ అనే నేను ఆయన నటించిన చివరి చిత్రం.

రేపు అంత్యక్రియలు
దేవదాస్ కనకాల పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తెసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కనకాల భౌతికకాయాన్ని ఇంటి దగ్గరే ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు