రీమేక్‌లకు దూరం

1 Aug, 2013 00:41 IST|Sakshi
రీమేక్‌లకు దూరం

ఇకపై రీమేక్ చిత్రాలు చేయనంటున్నారు యువ నటుడు జయం రవి. ఈయన పేరు ముందున్న జయంనే రవికి తొలి చిత్రం. విశేషం ఏమిటంటే  జయం నుంచి ఆ మధ్య నటించిన తిల్లాలంగడి వరకు అన్నీ రీమేక్ చిత్రాలే. జయం రవికి విజయాలందించి నిలబెట్టింది ఇలాంటి చిత్రాలే. దీంతో రీమేక్ చిత్రాల హీరో అనే ముద్ర పడింది.
 
 బహుశా ఆ ముద్రను తుడి చేసుకోవడానికే ఇకపై రీమేక్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నారేమో. ప్రస్తుతం భూలోకం, నిమిర్ద్నునిల్ చిత్రాలలో జయం రవి నటిస్తున్నారు. త్వరలో అన్నయ్య జయం రాజా దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చెబుతున్న సినీ విశేషాలేమిటో తెలుసుకుందామా.
 
 ప్రశ్న : ప్రస్తుతం నటిస్తున్న భూలోకం చిత్ర విశేషాలేమిటి?
 జవాబు : చాలా విశేషాలున్నాయి. కథ చెన్నై నేపథ్యమే. అయితే ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశం. చెన్నైలో నివసించే రెండు బాక్సింగ్ క్రీడ వంశాల కథ. ఇందులో జాతీయస్థాయి సమస్యను పొందుపరిచాం.
 
 ప్రశ్న : జయాపజయాలను ఎలా తీసుకుంటారు?
 జవాబు : జయాపజయాలనేవి ఒక గ్రాఫ్ లాం టివి. పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. నా వరకు ప్రతి చిత్రానికీ ఒకే రకంగా శ్రమిస్తాను. అన్ని చిత్రాలూ బాగా రావాలని కోరుకునే నటిస్తాం. అయితే ప్రేక్షకులదే అంతిమ తీర్పు.
 
 ప్రశ్న : పాత్రల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
 జవాబు : నేను కథ వినేటప్పుడే ఒక సాధారణ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. కథ విన్న వెంటనే నచ్చాలి. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే సందేహమే రాకూడదు. అలాంటి కథా చిత్రాలనే అంగీకరిస్తాను.
 
 ప్రశ్న : రీమేక్ చిత్రాలనే ఎక్కువగా చేస్తున్నారు. మీకు బోర్ అనిపించడం లేదా?
 జవాబు : తొలి రోజుల్లో అలాంటి చిత్రాలలో నటించాను. ఇప్పుడు నేరు చిత్రాలే చేస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న భూలోకం, నిమిర్ద్నునిల్ చిత్రాలు నేరు కథా చిత్రాలే. త్వరలో అన్నయ్య, నేను కలసి ఒక చిత్రం చేయనున్నాం. ఇకపై రీమేక్ చిత్రాల హీరో అనే పేరు మారుతుంది.