హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

19 Oct, 2015 10:59 IST|Sakshi
హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

విశాఖపట్నం: ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన 'కళ్లు' చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందారు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. కళ్లు, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపెందిరి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.