కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు కూడా : నాగబాబు

23 May, 2020 11:58 IST|Sakshi

హైదరాబాద్‌ : మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబు కొణిదెల సోషల్‌ మీడియాలో రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలె జాతిపిత మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలపై గాంధేయవాదులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. అంతేకాకుండా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈ మెగా​ బ్రదర్‌ చేసిన మరో ట్వీట్‌ వివాదస్పదమవుతోంది. 

‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, లాల్‌ బహదూర్‌, పీవీ నరసింహారావు, అబ్దుల్‌ కలాం, సావర్కార్‌, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్బావానికి కృషి చేసి మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ ట్వీట్‌ చేశారు. 

‘గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసి దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ మరో ట్వీట్‌లో నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెంటు ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. 

చదవండి:
గాడ్సే నిజమైన దేశభక్తుడు
పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు
అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం

మరిన్ని వార్తలు