తల్లిదండ్రులను పట్టించుకోని నాజర్‌

19 May, 2019 08:37 IST|Sakshi

నటుడు నాజర్‌పై సోదరులు ఆరోపణలు

సాక్షి, చెన్నై : వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను నటుడు నాజర్‌ పట్టించుకోవడం లేదని, వారికి ఆర్థిక సాయం చేయకున్నా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. ఈ విషయంలో నాజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. 

నటుడు నాజర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఈయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా చిత్రాలు చేశారు. ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగాను పదవిలో ఉన్నారు. అంతేకాదు. నాజర్‌ భార్య కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్‌ చెన్నై స్థానం నుంచి పోటీ చేశారు. 

కాగా, నాజర్‌ తమకు ఎలాంటి సాయం చేయడం లేదని, తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన వీరు తాజాగా మరోసారి నాజర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాజర్‌ తమ్ముళ్లు జవహర్, ఆయుబ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము నలుగురు అన్నదమ్ములమని అందులో నాజర్‌నే పెద్ద వాడని తెలిపారు.  

వివాహనంతరం తమ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని చెప్పారు. మిగిలిన ముగ్గురిలో చివరి సోదరుడు మానసికంగా వ్యాధిగ్రస్తుడని తెలిపారు. దీంతో తామిద్దరమే కుటుంబ భారాన్ని మోసుకొస్తున్నట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంతో, అనారోగ్యానికి గురయ్యారన్నారు. కాగా, నటుడిగా బాగా సంపాదించిన నాజర్‌ తన భార్య పిల్లలకే ఖర్చు చేసుకుంటున్నాడు గానీ, తమకెలాంటి సాయం అదించడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోకపోగా, కనీసం వారిని చూడడానికి కూడా రావడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాజర్‌ స్పందించకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు