పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

16 Jun, 2019 03:44 IST|Sakshi
ప్రకాశ్‌రాజ్‌

‘‘పిల్లలు పుట్టినప్పుడే తల్లీదండ్రీ పుడతారు. పిల్లలతో పాటు పేరెంట్ప్‌ కూడా ఎదగాలి’’  అంటున్నారు ప్రకాశ్‌రాజ్‌. ఒక తండ్రి ఎలా ఉండాలి? పిల్లలు సరైన దారిలో నడవాలంటే పేరెంట్స్‌ ఏం చేయాలి? వంటి విషయాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

► సినిమాల్లో అనేక తండ్రి పాత్రలు పోషించారు. ఓ తండ్రి పిల్లలతో ఎలా ఉండాలి?
సినిమాలు వేరు. జీవితం వేరు. సినిమాల్లో కథ చెప్పడానికి సృష్టించిన పాత్రలవి. వాళ్లు నిజంగా తండ్రులు కారు. వాళ్లు అమ్మలూ కాదు. సరదాగా చెప్పాలంటే మహాత్మాగాంధీ గారి తర్వాత నేనే ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌ అంటాను. అన్ని రకాల తండ్రి పాత్రలు చేశా. పాజిటివ్, నెగటివ్, కేరింగ్‌ ఇలా అన్నీ చేశా. అవి వేరు. కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ పాత్ర ద్వారా కొన్ని భావాలు చెబుతుంటారు. జీవితం విషయానికొస్తే... తండ్రి అనేది ఒక వ్యక్తిత్వం. నాకు మొత్తం నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.

దురదృష్టవశాత్తు ఒక కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిపి నేను. మనం అనుకుంటాం.. మనం పిల్లల్ని పెంచుతున్నాం అని. మనం మాత్రమే కాదు, మనతోపాటు మన సమాజం, మన చుట్టూ ఉండే మనుషులు, స్కూలు, నేర్చుకోవాలనే వాళ్ల ఆకలి... ఇవన్నీ కూడా వాళ్లను పెంచుతుంటాయి. పొద్దున్నే స్కూల్లో వదిలేస్తాం. సాయంత్రం 4 వరకూ రారు. ఎప్పుడూ వాళ్ల పక్కనే ఉండలేం. బయటి ప్రపంచం కూడా వాళ్లకు నేర్పిస్తుంది. భోజనం సమకూర్చడం, చదివించడం.. కేవలం ఇవే కాదు తండ్రి అంటే? పిల్లలు మానసికంగా వికాసం చెందడంలో తోడ్పడే వాడే అసలు సిసలు తండ్రి.

► పిల్లల్లో మానసిక వికాసం కోసం ఏం చేయాలి?
ఇప్పుడు నాకు 54 ఏళ్లు. నా కూతురికి 23. నా యవ్వనంలో నా ఆకలి, ఆలోచనలు వేరు. నాకు, నా కూతురికి దాదాపు 30 ఏళ్ల డిఫరెన్స్‌ ఉంది. ప్రతి పదేళ్లకు జన రేషన్‌ మారుతుంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు మన మూలంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన జీవులు. వాళ్లు ఎగరడానికి రెక్కలు, శక్తి ఇవ్వాలి కానీ వాళ్లు ఎటు ఎగరాలో ఎటు ప్రయాణం చేయాలో మనం నిర్దేశించలేం. నిర్దేశించకూడదు కూడా. నిర్దేశిస్తే వాళ్లు మన చేయి పట్టుకుని నడుస్తారు. సొంత అభిప్రాయాలు ఉండవు. సొంతంగా ఆలోచించలేరు. అప్పుడు మానసిక వికాసం ఎలా వస్తుంది? అందుకే పిల్లలను ఎదగనివ్వాలి.

► మనం చేయి వదిలిస్తే సమాజం నుంచి పిల్లలు ఏదైనా చెడు నేర్చుకునే అవకాశం ఉంది కదా.. అందుకే స్వేచ్ఛ ఇవ్వకూడదనే భయం చాలా మందిలో ఉంటుంది..
భయం ఎప్పుడు ఉంటుందంటే.. మన పెంపకంలో నమ్మకం లేనప్పుడు. మా అమ్మ మాతోనే నా ఇంట్లో ఉంటుంది. ఆమెకు 78 ఏళ్లు. ‘మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మకు కోపం వస్తుంది కదా’ అనే పెంపకంలో నేను పెరిగాను. ఇప్పటికీ ఆ భయం ఉంటుంది. మన ఆబ్సెన్స్‌లో కూడా పిల్లలతో మన ప్రెజెన్స్‌ ఉండాలి. మనం ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒక ఫ్లూట్‌ నుంచి మ్యూజిక్‌ బయటకు వచ్చాక ఆ సంగీతం మీద ఆ ఫ్లూట్‌కి ఎంత హక్కుంది? పిల్లల విషయంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే మన పిల్లల్ని బాధ్యతగా పెంచుతూ, వాళ్ల ఆశల్ని, ఆశయాల్ని గౌరవిస్తామో అప్పుడు ఎలాంటి భయాలూ ఉండవు.

► మన పిల్లలు చెడు దారి పట్టరనే నమ్మకం తల్లిదండ్రులకు ఎలా కలుగుతుంది?
ఇప్పుడు నా పెద్ద కూతురిని తీసుకుందాం. 17 ఏళ్లకే తనంతట తానే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగేంత సామర్థ్యం ఉన్న అమ్మాయిలా పెరిగింది. 12 ఏళ్ల వయసులో తనకు పెయింటింగ్‌లో ఆసక్తి ఉందని చెప్పింది. హాస్టల్‌లో పెట్టాను. మ్యూజిక్‌ నేర్చుకుంది. యూకే వెళ్తాను అంది. పంపించాను. మా ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్, స్నేహం అలాంటిది. అది ఎలా కుదిరిందీ అంటే.. కూర్చుని మాట్లాడటం వల్ల. మన పిల్లల ఆలోచనలను గౌరవించకపోతే వాళ్లతో కూర్చుని ఓపెన్‌గా మాట్లాడలేం. అసలు వినం కూడా. అది తప్పు. మనం పెద్దవాళ్లయినంత మాత్రాన మనదే కరెక్ట్‌ అనుకోకూడదు. పిల్లలు కిందపడితే ‘నాకు మా అమ్మానాన్నలు ఉన్నారు’ అనే భరోసా ఇవ్వాలి. అప్పుడు చెడు దారి పట్టరు.

► ఒక భర్తకు భార్య విలువ కూతురు పుట్టాక తెలుస్తుంది అంటారు. నిజమేనా?
అవును. చాలామంది భర్తలు భార్యని దేవతగా చూసి మావగారిని విలన్‌గా చూస్తారు. అయితే వాళ్లకు కూతురు పుట్టినప్పుడే ‘నా భార్య కూడా ఇంకొకడి కూతురే కదా. నా కూతురి విషయంలో నేనెంత ప్రొటెక్టివ్‌గా ఉన్నానో తన కూతురి విషయంలో ఆ తండ్రి కూడా అలానే ఉంటాడు కదా’ అని అర్థం అవుతుంది. మామగారు పెళ్లి చేసి భర్తతో పంపించేశాక,  ‘ఇది నా సొమ్ము. తను వాళ్ల నాన్నగారి మాట ఎందుకు వినాలి ? వింటే ఇక్కడ ఉంటావు.. లేదంటే పుట్టింటికి వెళ్లిపోతావు’ అంటాం. అదే కూతురు అత్తింటికి వెళ్లిపోతున్నప్పుడు వేరే ఫీలింగ్‌ ఉంటుంది. అందుకే అంటున్నా...  పిల్లలు పుట్టినప్పుడే తండ్రి కూడా పుడతాడు. అప్పటివరకూ ఉన్న మగవాడు వేరు. ఆ తర్వాత వేరు. కొత్త మనిషి అన్నమాట. ఆ కొత్త మనిషి పిల్లలతో పాటు ఎదుగుతాడు.

► తాగుబోతు తండ్రి, బాధ్యత లేని తండ్రుల వల్ల పిల్లలు కూడా అలానే తయారవుతారా?
లేదు. ఒక ఇంట్లో తండ్రి తాగుబోతు, పిల్లలను పట్టించుకోలేదు అనుకుందాం. తల్లి పెంచింది అనుకుందాం. అలాంటి తండ్రి కూడా ఓ తండ్రి ఎలా ఉండకూడదో పిల్లలకు నేర్పినట్లే. పెద్దయ్యాక తన పిల్లల విషయంలో ఇలా ఉండకూడదని ఆ పిల్లలు నేర్చుకుంటారు. మంచి తండ్రిని చూసి మంచిని, చెడ్డ తండ్రిని చూసి మంచిని నేర్చుకుంటారు. ఏదైనా పాఠమే. వాళ్ల గాయాలు, వాళ్ల తపనలు, వాళ్ల పడిపోవడాలను వాళ్లనే అనుభవించనివ్వాలి. పడిపోతే పట్టుకోవడానికి ‘నేనున్నాను’ అనే నమ్మకాన్ని పిల్లలకు కలిగించగలగాలి.

► ఇలాంటి నమ్మకాన్ని కలిగించగలిగితే వాళ్లు సరైన మార్గంలో వెళ్తారంటారా?
వెళ్తారు. నువ్వు తరచూ వాళ్లతో మాట్లాడుతుండాలి. పొద్దున్నే స్కూల్‌ యూనిఫామ్‌ వేసి, స్కూల్‌కి పంపుతున్నాం.. అది చేశాం.. ఇది చేశాం అని త్యాగాలు చేస్తున్నట్టు మాట్లాడతాం. ముందు దాన్ని తీసేయాలి. నిన్ను ఎవడు అడిగాడు త్యాగం చేయమని? పిల్లల్ని పెంచడం నీ బాధ్యత. పిల్లల కోసం నువ్వు కష్టపడుతున్నావు. దాన్ని చెప్పి చూపిస్తూ పెంచకూడదు. నీ ఫిలాసఫీ ఏంటి? నీ నమ్మకాలేంటి? అనేవి మాట్లాడుతుండాలి.. అంతే. పిల్లలు మనల్ని ఒక పుస్తకం చదివినట్టు చదువుతుండాలి. మన పిల్లల దగ్గరే మనం సీక్రెట్స్‌ పెట్టుకున్నాం కదా? పిల్లలు తల్లినో తండ్రినో చూసే పెరుగుతారు. వాళ్లకు పుస్తకంగా ఉండగలిగితేనే ఏది తప్పో ఏది రైటో డిసైడ్‌ చేసుకోగలుగుతారు. మనం అది చేయం. మన సీక్రెట్స్‌ మనం పెట్టుకుంటాం. మన ప్లస్‌ పాయింట్స్,. మన శక్తిని మాత్రమే చూపిస్తాం. పిల్లలకన్నా మనం స్ట్రాంగ్‌ అని చూపిస్తూ ఉంటాం.

► ఇవన్నీ మీరెలా తెలుసుకోగలిగారు?
మనిషి అంటేనే అద్భుతం. తన బతుకుని తన కళ్ల ముందు చూసుకుంటూ.. కొన్ని వాస్తవాల మీద దృష్టి పెడితే వాళ్లకే అర్థం అవుతుంది. కొంతమంది పిల్లల్ని కొడతారు. వాళ్లను కొట్టడానికి అసలు చేయి ఎలా వస్తుంది? పెరుగుతున్న ఓ చిన్న మొక్కను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు. మనం పిల్లలతో అటాచ్డ్‌గా ఉంటూనే డిటాచ్డ్‌గా ఉండాలి. వాళ్ల గ్రోత్‌ని ఎంజాయ్‌ చేయాలి. వాళ్లతోనే ఎదగాలి.

► మరి మన కోపాన్ని పిల్లల మీద ఎలా చూపించాలంటారు? మన అనుభవంతో ఆలోచించి కొన్ని చేయొద్దు అంటాం కదా?
ఆ విషయాన్ని ముక్కుసూటిగా మీ పిల్లలతోనే చెప్పండి. అయితే మనకు బేసిక్‌గా సహనం ఉండదు కదా. ‘నీకేం తెలుసు’ అంటాం. ఆ మాట ఎలా వస్తుంది అసలు? వాళ్లు పిల్లలు. వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు సహనంగా కూర్చుని వివరించి చెప్పొచ్చు కదా. నా మూడేళ్ల కొడుకుతో నేను మాట్లాడుతుంటాను. వాడితో ఏం మాటలు అంటుంది నా భార్య. లేదు.. వాడికి చెప్పాలి, మాట్లాడాలి అంటాను నేను. అది నా బాధ్యత. ఒక్కసారి కాకపోతే 10 సార్లు చెబుతాను. ‘ఐయామ్‌ హర్ట్‌’ అంటాను వాడితో. వాడికి అర్థం అయ్యేలా చెప్పడానికి. చేయెత్తను. వాళ్లకు తెలియదని మనకు తెలుసు కదా. అర్థం అయ్యేట్టు చెబితే వాడికి బుర్రలోకి ఎక్కుతుంది.

► మీరు చెప్పినవాటిలో మీ మూడేళ్ల కొడుకు అర్థం చేసుకుని, ఆచరిస్తున్నవాటి గురించి?
వాడికి మిల్క్‌ ప్రొడక్ట్స్‌ పడవు. ఆ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. ఓపికగా చెప్పాను. దాంతో ఎవరైనా మిల్క్‌ చాక్లెట్‌ ఇస్తే ‘నో.. అది నాకు అలర్జీ’  అని అంటాడు వాడు. నేనే ఇచ్చినా ‘డాడీ యాక్‌’ అంటాడు.  నా పిల్లలు పెద్ద పెద్ద పదాలు, వాక్యాలతో మాట్లాడతారు. నా చిన్నోడు కూడా. ఎందుకంటే నేను పెద్దవాళ్లతో మాట్లాడినట్టే వాళ్లతోనూ మాట్లాడతాను. అలానే వాళ్లు నేర్చుకుంటారు. వాళ్లను వాళ్లు ఎక్స్‌ప్రెస్‌ చేయడం నేర్చుకుంటారు. నా కొడుకు మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. వాడి సంగతి ఎలా ఉన్నా 50 ఏళ్ల వయసులో నాకు కొడుకు పుట్టాడు. దాంతో నాకు మళ్లీ 10, 15 సంవత్సరాల యవ్వనం వచ్చినట్టుంది. ‘జనరేషన్‌కు ఒకర్ని కన్నావు కదా డాడీ’ అని నా కూతురు సరదాగా అంటుంది.

► మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మీ ఇద్దరు కూతుళ్లు మిమ్మల్ని అర్థం చేసుకున్నారా?
నేను పెళ్లి చేసుకునే సమయానికి మా పెద్దమ్మాయికి 14 ఏళ్లు. నా తల్లి, చెల్లి, కూతురు.. ముగ్గుర్నీ కూర్చోబెట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి (పోనీవర్మ)ను తీసుకొచ్చి ‘ఈమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? అని అడిగాను. మా అమ్మాయి ‘డాడీ.. గో ఎహెడ్‌’ అంది. మా అమ్మ ఏడ్చేసింది. నా ఫ్యామిలీలోనే చాలామంది స్త్రీలు ఉన్నారు. అమ్మ, భార్య, పిల్లలు, చెల్లి.. ఇలా వీళ్లందరికీ ఎక్స్‌ప్రెస్‌ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనం ఒక సొసైటీలో బతుకుతున్నాం.

నన్ను చూస్తూనే నా కూతుళ్లు ఇద్దరూ పెరిగారు కదా. వాళ్ల అమ్మతో అనుచితంగా ప్రవర్తిస్తే నా కూతుళ్లు కూడా ఆడవాళ్లే కాబట్టి నా మీద కోపం పెరుగుతుంది. అప్పుడు ఒక మగాడిగా వాళ్లకు నేను మంచి ఎగ్జాంపుల్‌ ఎలా కాగలను? పిల్లల విషయంలో లత (మొదటి భార్య), పోనీ (రెండో భార్య) ఫ్రెండ్స్‌ అయిపోయారు. లతకు ఇప్పుడు నేను భర్తని కాదు. పోనీకు మాత్రమే భర్తను. లతకు నేను మాత్రమే డివోర్స్‌ ఇచ్చాను. నా పిల్లలు, మా అమ్మ డివోర్స్‌ ఇవ్వలేదు. లతకు, నాకూ మధ్య సమస్య ఉండి, అబద్ధాలతో కలిసి బతకొద్దని విడిపోయాం.

ఒక తల్లిదండ్రులుగా పిల్లల మీద చూపించే ప్రేమ ఒకటే కానీ, భార్య, భర్తగా విడిపోదాం అనుకున్నాం. దానికి లత, పోనీ ఒకర్ని ఒకరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీకి అన్యాయం చేస్తూ ఇంకో స్త్రీతో ఎలా ఉండగలుగుతాను. ఈ స్త్రీ విషయంలో నేను చేసినది కరెక్ట్‌ అనిపిస్తేనే ఇంకో స్త్రీతో జీవితాన్ని పంచుకోగలుగుతాను. అందుకే హానెస్ట్‌గా ఉన్నాను. లత, నేను ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్‌ చూస్తూనే పిల్లలు పెరుగుతారు. అప్పుడే వాళ్ల నిర్ణయాలను వాళ్లు ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఎవరైనా సమాజానికి కాదు మనస్సాక్షికి భయపడాలి.

► రెండో పెళ్లి ద్వారా కలిగిన మీ కుమారుడితో మీ పెద్ద కూతుళ్ల బాండింగ్‌?
పెద్దమ్మాయికి 23, చిన్నదానికి 13, వాడికి 3. నా భార్య నా మరో కూతురులాంటిది. తనకి 42. నాకు 54. అందరికీ దాదాపు  పదేళ్లు గ్యాప్‌ ఉంది గమనించారా? మొన్నే అందరం కాశ్మీర్‌ వెళ్లాం. వీలు కుదిరినప్పుడల్లా ఏదో ప్లేస్‌కి వెళతాం. ఎంజాయ్‌ చేస్తాం. మా బాండింగ్‌ బావుంటుంది.

► కూతుర్ని కొడుకులా పెంచాను అంటారు కొందరు.. అలా అనడం ద్వారా కొడుకే గొప్ప అని చెప్పినట్లు అవుతుంది కదా?
అవును. ఎవరో నాతో మా పెద్దమ్మాయిని చూపిస్తూ ‘నీ పెద్దకొడుకు’ అన్నారు. ‘కొడుకు కాదయ్యా.. తను నా కూతురు. కొడుకు కన్నా ఎక్కువ’ అని చెప్పా. ఆ సెన్సిటివిటీ చాలా ముఖ్యం. జెండర్‌ ఈక్వాలిటీ అనేది మన ఇంట్లోనే మొదలవ్వాలి. ఇంట్లో కొడుకు అయితే ఒకలా చూడటం కూతురైతే మరోలా చూడటం చేయకూడదు. అలా చేస్తే సమాజం ఎప్పటికీ మారదు.  

► అలాగే కూతుళ్లను చదివించడం వేస్ట్‌ అని  కొందరు అనుకుంటారు...
నేను దత్తత తీసుకున్న ఊర్లో గవర్నమెంట్‌ స్కూల్‌లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. ప్రైవేట్‌ స్కూల్‌కి వెళ్లే బస్‌ నిండా అబ్బాయిలే. ఆ తేడా ఎందుకో? కూతుళ్లైతే ఏంటి? కొడుకులైతే ఏంటి? ఇద్దరూ మన పిల్లలే కదా. నా లైఫ్‌లో మెన్‌ కంటే విమెన్‌ చాలా స్పెషల్‌ అని గర్వంగా చెప్పగలను. ఉమెన్‌ ఈజ్‌ వెరీ స్పెషల్‌. వెరీ క్రియేటివ్, డౌన్‌ టు ఎర్త్‌. యాక్చువల్లీ వాళ్లే ఎర్త్‌. నేచర్‌. మగాళ్ల కంటే కూడా స్త్రీలు కచ్చితంగా కొంచెం విలువైన వాళ్లే.

► ఫైనల్లీ మీ పిల్లలతో మీరు మాట్లాడేవాటిలో ఎక్కువగా వచ్చే టాపిక్స్‌ గురించి?
ఫిలాసఫీ, పాలిటిక్స్, సాహిత్యం, మొక్కలు, జీవితం... ఇలా అన్నింటి గురించీ మాట్లాడతాను. నేను చదివిన పుస్తకాల గురించి, విన్న కవిత గురించి చెబుతాను. వాళ్లు ఏదో చెబుతారు. అలా సంభాషించుకుంటాం. పిల్లలకు మనం ఓపెన్‌ బుక్‌ అవ్వాలంటే ఇలాంటివన్నీ ఉండాలి. అవన్నీ మాటల వల్లే అవుతుంది. అందుకే పిల్లలతో మాట్లాడదాం. ఆ మాటలే మనల్ని వాళ్లకు దగ్గరగా ఉంచుతాయి.

► పిల్లలకు టైమ్‌ స్పెండ్‌ చేసే తీరిక లేనంత బిజీగా తల్లిదండ్రులు ఉండవచ్చా?
అస్సలు ఉండకూడదు. మనం చెప్పకముందే తల్లిదండ్రులతో తమ బంధాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఎప్పుడు ఏర్పడుతుంది? అంటే.. పిల్లలతో మనం ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసినప్పుడే. తండ్రి అనేవాడు పిల్లలకు మరిచిపోలేని మంచి అనుభూతి అవ్వాలి. మరిచిపోలేని క్షణాలు అవ్వాలి. ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా అవన్నీ మర్చిపోయి పిల్లలతో గడపాలి. వాళ్లతో ఎక్కువ సమయం గడిపేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పిల్లలు, తల్లిదండ్రులూ కలిపి పెరుగుతారు. మనం ఆల్రెడీ ఎదిగిపోయాం, వాళ్లు ఎదగాలి అన్నట్టు ఉండకూడదు. ఓ రిలేషన్‌షిప్‌ని నేను అలానే చూస్తాను.  మా పిల్లలతో అలానే ఉండే ప్రయత్నం చేస్తున్నాను.

– డి.జి. భవాని


కుమారుడు వేదాంత్‌తో..

భార్యాపిల్లలతో ప్రకాశ్‌రాజ్‌
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు