విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!

21 May, 2020 09:20 IST|Sakshi

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా మళ్లీ ప్రేమలో పడినట్లు బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నటుడు సత్యదీప్‌ మిశ్రాతో ఆమె డేటింగ్‌ చేస్తున్నట్లు ముంబై మిర్రర్‌ ఓ కథనం ప్రచురించింది. విహార యాత్ర కోసం గోవాకు వెళ్లిన ఈ జంట లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారని.. అప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఇక సత్యదీప్‌, మసాబా ఇటీవల ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరూ ఒకే విధమైన బ్యాక్‌గ్రౌండ్‌లో వివిధ భంగిమల్లో వేరవేరుగా నిల్చుని ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరూ సత్యదీప్‌ ఇంట్లోనే ఉన్నారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. కాగా వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, నీనా గుప్తాల కూతురైన మసాబా.. ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి)

ఈ క్రమంలో 2015లో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులకు దరఖాస్తు చేయగా.. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక సత్యదీప్‌ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. ఇక అదితి ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారించి వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు