మీటూ : సాజిద్‌కు షోకాజ్‌ నోటీసు

15 Oct, 2018 16:25 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో వీటిపై వివరణ ఇవ్వాలని భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం సోమవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. మీటూ క్యాంపెయిన్‌లో భాగంగా తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై వారంలోగా స్పందించాలని లేకుంటే చర్యలు చేపడతామని ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. హమ్‌షకల్స్‌, హిమ్మత్‌వాలా మూవీల దర్శకుడిగా మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని వర్ధమాన నటులు రేచల్‌ వైట్‌, సిమ్రాన్‌ సూరిలపై లైంగిక వేధింపులకు దిగడం దారుణమని పేర్కొంది. ప్రముఖ జర్నలిస్ట్‌ కరిషామ ఉపాథ్యాయ్‌ నుంచి ఈ మెయిల్‌ ఫిర్యాదులు సైతం తమను దిగ్ర్భాంతికి గురిచేశాయని అసోసియేషన్‌ తెలిపింది. మీ అసభ్య చేష్టలతో భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం ప్రతిష్టను దిగజార్చారని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఆందోళన వ్యక్తం చేసింది.


ఆడిషన్‌ కోసం వెళితే..

సాజిద్‌ ఖాన్‌పై తాజాగా నటి సిమ్రాన్‌ సూరి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2012లో హిమ్మత్‌వాలా మూవీలో పాత్ర గురించి లుక్‌ టెస్ట్‌ కోసం తనను సాజిద్‌ ఖాన్‌ తన ఇంటికి రమ్మని పిలిచి తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాను ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో సాజిద్‌ ఫార్మల్‌ దుస్తుల్లో ట్రెడ్‌మిల్‌పై ఉన్నారని, తనను దుస్తులు తీసివేయమన్నారని చెప్పుకొచ్చారు. అందుకు నిరాకరించి తాను అక్కడి నుంచి వచ్చేశానని చెప్పారు. సాజిద్‌ తర్వాత పలుమార్లు ఫోన్‌ చేయగా తాను గట్టిగా ప్రతిఘటించానని చెప్పారు.

మరిన్ని వార్తలు