ఆయనతో భోజనం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది!

13 Feb, 2019 13:41 IST|Sakshi

అన్నమయ్య సినిమాతో గుర్తింపు

తెలుగులో హీరోగా 99 చిత్రాలు పూర్తి

సినీ హీరో సుమన్‌

నాలుగు దశాబ్దాలుగా యాక్షన్, ఫ్యామిలీ, కుటుంబ, పౌరాణిక, విలన్‌..తదితర పాత్రల్లో నటించి తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. మంగళవారం పార్నపల్లె గ్రామంలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  – బండిఆత్మకూరు

ప్రశ్న: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు.?
జవాబు: తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, కొరియా, ఇంగ్లిష్, హిందీ భాషలు అన్ని కలపి 400 సినిమాల్లో పలు పాత్రల్లో నటించాను. తెలుగు, తమిళం, కన్నడం బాషల్లో హీరోగా 150 సినిమాల్లో నటించా. తెలుగులో హీరోగా 99 సినిమాల్లో నటించా. వందో చిత్రం వయస్సుకు తగిన పాత్ర వస్తే కమర్షియల్‌ సినిమా చేయాలని ఉంది.       

ప్రశ్న: తెలుగులో నటించిన తొలి తెలుగు సినిమా?
జ: తెలుగులో తొలి సినిమాగా ‘ఇద్దరు కిలాడీలు’ చేశాను. అయితే ఆ తర్వాత నటించిన తరంగిణి సినిమానే మొదట విడుదలైంది. 1977లో తొలిసారిగా తమిళంలో స్విమ్మింగ్‌ ఫూల్‌ చిత్రంలో హీరోగా నటించా.

ప్రశ్న: మీకు గుర్తింపు తెచ్చిన పాత్ర ?
జ: అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరస్వామిగా నటించిన పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత నటించిన రామదాసు సినిమాలో రాముని పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది.  సత్యనారాయణ స్వామి సినిమాలో ఏడు వేషధారణలు చేసి వ్రతం ఏ విధంగా చేయాలో ప్రజల్లో చూపించడం జరిగింది. ఈ పాత్రే నాకు ఎక్కువగా సంతృప్తినిచ్చింది.  

ప్రశ్న: మీరు సినిమాలో చేయని పాత్రలు ఏవైనా మిగిలి ఉన్నాయా.?
జ: కమెడియన్‌గా ఇంతవరకు ఒక పాత్ర కూడా చేయలేదు. దీంతో ఆ లోటును భర్తించడానికి క్రేజీ..క్రేజీ సినిమాలో నటిస్తున్నా. ఇందులో అందరి కమెడియన్లు మాదిరి కాకుండా తన కామెడీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల పాత్రల ఆధారంగా విభిన్నంగా ఉంటుంది. దీనికి తొలిసారిగా సంజై దర్శకత్వం వహిస్తున్నారు.  

ప్రశ్న: మీ జీవితంలో చాలా సంతృప్తినిచ్చిన అంశం?
జ: భారత రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ పక్కన కూర్చోని నటించిన అన్నమయ్య చిత్రం ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ తర్వాత ఆయనతో కూర్చోని భోజనం చేసే అవకాశం కూడా కలిగింది. నాకు వచ్చిన ఎన్నో అవార్డుల కంటే  ఇది ఎంతో సంతృప్తినిచ్చింది.    

ప్రశ్న: నేటి తరం ఆర్టిస్టులకుమీ సలహా?
జ: నేటి తరం యువకులు ఒక సినిమా ప్లాప్‌ అయితే, అవకాశాలు తగ్గితే బేజారు అవుతున్నారు. ప్రస్తుతం ఒక భాషలో అవకాశాలు లేకపోతే ఇతర భాషల్లో వెళ్లి అవకాశాలు కల్పించుకోవచ్చు. గతంలో తెలుగు, తమిళంలో మాత్రమే అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం టాలెంట్‌ ఉంటే బాలీవుడ్, హాలీవుడ్‌ స్థాయికి వెళ్లవచ్చు.  

ప్రశ్న: దైవశక్తిపై మీ అభిప్రాయం ఏమిటి.?
జ: ప్రతి ఒక్కరు తమకు తెలిసినంత వరకు ఎవరికి ద్రోహం చేయరాదు. ఒకరికి మంచి చేస్తేనే మనకు దేవుడు ఏదో రూపంలో సహాయం చేస్తారు. తమకు తెలియకుండా తప్పు చేస్తే ఆ తర్వాత తప్పును తెలుసుకోని సరిచేసుకోవాలి. దేవుని దయ వల్లే నేను ఇన్ని సంవత్సరాలుగా చిత్ర సీమలో పలు పాత్రల్లో నటిస్తున్నా.    

ప్రశ్న: మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.?
జ: రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదు. గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పదిరోజుల ముందు ఒక టీవీ ఇంటర్వూలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పా. ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్‌ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.      

ప్రశ్న: పైరసీ పట్ల మీ అభిప్రాయం ఏమిటి.?
జ: ప్రస్తుతం సినిమా విడుదలైన మొదటి రోజే సగం సినిమా పూర్తి అయిన వెంటనే ఫైరసీ సీడీలు, రెండవ గంటలోనే వస్తున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో నష్టం జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలి. పైరసీని అరికట్టేందుకు ముందుగా అభిమానుల్లో చైతన్యం తేవాలి.

ప్రశ్న: అప్పటికి.. ఇప్పటికి సినిమాల్లో తేడా?
జ: అప్పట్లో సినిమాల్లోకి రావడానికి ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉండేది. ప్రస్తుతం జిమ్‌కు వెళ్లి సిక్స్‌ ప్యాక్స్‌ పెంచుకోవడం, డ్యాన్స్‌ చేయడం నేర్చుకుంటే అవకాశాలు వస్తున్నాయి. గతంలో మేము ఏదైనా షూటింగ్‌ చేయాలంటే సంబంధిత లొకేషన్‌కు వెళ్లే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా అక్కడి లొకేషన్లకు వెళ్లకుండానే డిజిటల్‌ ఐజేషన్‌ ద్వారా చేయవచ్చు. 

మరిన్ని వార్తలు