క్షీణ దశలో ఆ రెండూ : సీనియర్‌ నటుడు

18 Mar, 2018 08:26 IST|Sakshi
నటుడు వివేక్‌(ఫైల్‌)

సాక్షి, సినిమా : క్షీణ దశలో ఆ రెండు రంగాలు కొట్టుమిట్టాడుతున్నాయని సీనియర్‌ నటుడు వివేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చార్జీలు తగ్గించాలన్న నిర్మాతల డిమాండ్‌ను వారు పట్టించుకోకపోవడంతో ఈ నెల 1న నుంచి కొత్త చిత్రాలను విడుదల చేయరాదని నిర్మాతల మండలి తీర్మానం చేశారు. దీంతో అప్పటి నుంచి థియేటర్లలో కొత్త చిత్రాలు విడుదల కావడంలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యం నిర్మాతల మండలికి సహకరించకుండా పాత తమిళ చిత్రాలను, ఆంగ్లం, హిందీ, తెలుగు వంటి ఇతర భాషా చిత్రాలను ప్రదర్శించుకుంటున్నాయి. అయినా ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి చిత్రం నిర్మాణాలను నిలిపివేయడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. చెన్నై థియేటర్ల సంఘం ప్రదర్శనల రద్దుకు నిరాకరించినా, తమిళనాడు థియేటర్ల సంఘం ప్రభుత్వం తమకు ఇంతకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈ నెల 16 నుంచి ప్రదర్శనలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో చిత్ర పరిశ్రమ పూర్తిగా పడకేసింది. ఇదిలా ఉంటే కావేరి పరివాహక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలు నెలకొనడంతో కావేరి డెల్టా రైతుల పరిస్థితి జీవన పోరాటంగా మారింది. రైతులు పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. మరో పక్క పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని పోరుబాట పట్టినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఈ పరిస్థితులపై నటుడు వివేక్‌ స్పందిస్తూ తమిళనాడులో ప్రస్తుతం క్షీణ దశకు చేరుకున్నది రెండు రంగాలన్నారు. అవి ఒకటి వ్యవసాయం, రెండు సినిమా అని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం సంక్షోభానికి బీటలు వారిన నేల, మరుగైన నదులు, చెట్లు, ఫలించని పథకాలు అని అన్నారు. ఇక సినిమా స్తంభించడానికి ప్రణాళికలు లేని చిత్రాల విడుదల, చార్జీల పెంపు, పారితోషికాల అధికం లాంటివన్నారు. వీటన్నిటిలో ప్రభుత్వం కలగజేసుకుంటే పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా నటుడు వివేక్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు