కుక్కల కోసం ప్రత్యేక పార్కు..!

23 Aug, 2017 18:34 IST|Sakshi
కుక్కల కోసం ప్రత్యేక పార్కు..!

హైదరాబాద్‌: కుక్కల కోసం త్వరలో నగరంలో ప్రత్యేక పార్కు. అవును నిజమే. నటి అక్కినేని అమలకు జంతువులంటే అమితమైన ప్రేమ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. నెక్లెస్‌ రోడ్డులో కుక్కలకు ప్రత్యేకంగా పార్కు త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షురాలు, నటి అక్కినేని అమల వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బ్లూ క్రాస్‌ ఆధ్వర్యంలో జంతువుల జనన నియంత్రణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మియాపూర్‌లోని 108వ వార్డులో ప్రయోగాత్మకంగా 3 వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. వీధి కుక్కలు జఠిలమైన సమస్యలగా మారకముందే ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు. ఒక జత కుక్కలు రెండు వేల కుక్క పిల్లలకు జన్మనివ్వగలవని కాబట్టి కుటుంబ నియంత్రణ తప్పనిసరి అని చెప్పారు. పరిసరాలు, చెత్త డంపింగ్ వల్ల కుక్కల జననాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

 ఒక వెస్ట్‌, నార్త్‌జోన్‌ పరిధిలోని 1.20 లక్షల కుక్కలు ఉన్నట్లు బ్లూక్రాస్‌ గుర్తించిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో అన్ని కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసే స్తోమత బ్లూక్రాస్కు లేదని దీనికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా తాము సేవ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.