చార్మింగ్.. చార్మింగ్!

27 Apr, 2016 23:10 IST|Sakshi
చార్మింగ్.. చార్మింగ్!

 కొంతమంది పేర్లు భలే సెట్టవుతాయ్. అచ్చంగా ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంటారు. ఉదాహరణగా ‘చార్మి’ని చెప్పుకోవచ్చు. నిజంగానే చార్మింగ్‌గానే ఉంటారామె. ఈ పంజాబీ చిన్నది తెలుగు పరిశ్రమలో ఏ తోడూ లేకపోయినా ఎంతో నమ్మకంతో ‘నీ తోడు కావాలి’తో తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చారు. మొదటి సినిమాతో ‘ఓహో’ అని పేరు తెచ్చుకోకపోయినా నలుగురి దృష్టిలో పడ్డారామె. చిన్నప్పుడు పిల్లలు పాడుకుంటారే.. ‘చబ్బీ చీక్స్, రోజీ లిప్స్’ అని... చార్మీని చూడగానే ఆ రైమ్ గుర్తుకు రాక మానదు. మొదటి సినిమా తర్వాత తెలుగులో నో చాన్స్. కానీ, ఈ చార్మింగ్ గాళ్‌కి హిందీ, తమిళంలో అవకాశాలు వచ్చాయి.
 
 జనరల్‌గా ఒక సినిమా చేసి, ఆ తర్వాత ఏడాది పాటు కనిపించకపోతే, ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే తారల లిస్టులో చేర్చేస్తారు. చార్మీని కూడా అలానే అనుకున్నారు. కానీ, ‘నీకే మనసిచ్చాను’ అంటూ మరోసారి ఇక్కడి తెరపై కనిపించి, ఆ తర్వాత చేసిన ‘శ్రీఆంజనేయం’తో తిరుగు లేని తార అయిపోయారు చార్మి. పధ్నాలుగేళ్లల్లో 50 సినిమాలకు పైగా చేసి, మరో 50 సినిమాలు చేసేంత ఉత్సాహంగా ఉన్నారామె. ఇంతకీ.. చార్మి ఇంత లాంగ్ ఇన్నింగ్స్‌కి కారణం ఏంటి?
 
 మొదట్లో గ్లామరస్ క్యారెక్టర్స్‌కే పరిమితం అయినప్పటికీ, ఆ పాత్రల్లో కూడా వీలున్నంతవరకూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించగలిగారు చార్మి. ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’, ‘మంత్ర’, బాపు-రమణల ‘సుందరకాండ’, ‘కావ్యాస్ డైరీ’, ‘మంగళ, ‘ప్రేమ ఒక మైకం’... ఇలా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయడం చార్మి కెరీర్‌కి ప్లస్ అయ్యింది. తెలుగులో చేస్తూనే, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు హిందీ చిత్రం ‘బుడ్ఢా హోగయా తేరా బాప్’ కూడా చేశారు. అంతేకాకుండా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరిపోయారు. తాను నటించిన పాత్రలకు మాత్రమే కాకుండా చివరికి ‘చందమామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారు.
 
 ముంబయ్ నుంచి ఇక్కడికి వచ్చి, తెలుగు నేర్చుకుని.. ఆల్‌మోస్ట్ ‘పదహారణాల తెలుగమ్మాయి’ అయిపోయారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క సంవత్సరం కూడా చార్మి ఖాళీగా లేరు. జయాపజయాలతో అప్పుడప్పుడూ ఆటుపోట్లు తగిలాయి కానీ, ‘ఇక చార్మి పెట్టెబేడా సర్దుకోవాల్సిందే’ అని మాత్రం అనిపించుకోలేదు. కేవలం కథానాయికగానే మిగిలిపోకుండా చార్మి నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మి’లో టైటిల్ రోల్ చేసి, ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంతకూ చార్మి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
 
 చార్మి తాజాగా ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త లుక్‌లో కనిపించాలన్నదే ఆ నిర్ణయం. ఇప్పుడు కొత్తగా ఎందుకు కనిపించాలంటే... సినిమా సినిమాకీ ఒక కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది కాబట్టి, వాళ్లకు దీటుగా ఉండాలి. అందుకే, కొన్నాళ్ల పాటు బయట ఎక్కడా కనిపించకుండా... గుట్టుగా కసరత్తులు మొదలుపెట్టారు. ఓ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. ఇప్పటివరకూ కనిపించిన చార్మి వేరు.. ఈ మేకోవర్ తర్వాత కనిపించబోయే చార్మి వేరు.
 
 ఆ కొత్త లుక్ చూస్తే.. ఎవరికైనా ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది’ గుర్తుకు రావాల్సిందేనట. పధ్నాలుగేళ్ల కెరీర్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేయాలనుకోవడం మాటలు కాదు. పైగా.. శరీరాకృతిని మార్చుకుని మరీ చేయడం అంటే ఎంతో పట్టుదల ఉండాలి. చార్మికి అది ఉంది కాబట్టే, ఇన్నేళ్లయినా ఇంకా ఇక్కడ ఉండగలిగారు... ఇప్పుడు కొత్తగా మేకోవర్ అవుతున్నారు కాబట్టి, ఇంకొన్నేళ్లు ఉండగలుగుతారు. ఆల్ ది బెస్ట్ చార్మి!