అంతా పోగొట్టుకున్నా.. అవకాశాలివ్వండి

9 Jun, 2018 07:52 IST|Sakshi
ఛార్మిళ

తమిళసినిమా: సినీ రంగం ప్రతిభను గౌరవిస్తుంది. అవకాశాలను అందిస్తుంది. డబ్బు, పేరు, అంతస్తు అన్నీ ఇస్తుంది. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే జీవితం కడగళ్ల పాలే. ఎప్పుడో తనువు చాలించిన మహానటి సావిత్రి కడ జీవితం గురించి ఇప్పటికీ చర్చించుకుంటుంటాం. అయితే ఈ తరం హీరోయిన్లు చాలా ప్రీ ప్లాన్డ్‌గా జాగ్రత్త పడుతూ సంపాదించింది కూడబెట్టుకుంటున్నారు. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసి పలు రెట్లు పెంచుకుంటున్నారు. అలాంటిది నటి చార్మీళ లాంటి కొందరు హీరోయిన్లు భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తమిళంలో నల్లదోరు కుటుంబం, తైయల్‌క్కారన్, కిళక్కే వరుమ్‌ పాట్టు, ముస్తాఫా మనసే మౌనమా తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించి బాగా వెలిగిన నటి ఛార్మిళ.

అలాంటిది ఇప్పుడు అన్నీ కోల్పోయాను అవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని అభ్యర్థించే స్థాయికి దిగజారింది. ఆమె ఏమంటుందో చూద్దాం. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగినా, నా జీవితంలో అనూహ్య సంఘటనలు జరిగాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఆరోగ్యం పాడయ్యింది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ముందే జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా చేయలేను. మంచంలో పడ్డ నా తల్లిని చూసుకోవాలి. కొడుకు బాగోగులు చూసుకోవాలి. అందుకే ఆత్మహత్యకు పాల్పడలేదు. ఒక కాలంలో చాలా చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ప్రముఖ దర్శకులను అవకాశాలు అడిగితే ఇవ్వడం లేదు. నాకు నటించడానికి అవకాశాలు ఇవ్వండి. భవిష్యత్‌ కోసం డబ్బును కూడబెట్టుకోలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు.

సినిమాల్లో ముమ్మరంగా నటిస్తున్నప్పుడు ఆడంబర జీవితాన్ని అనుభవించాను.తరచూ విదేశాలకు వెళ్లి నక్షత్ర హోటళ్లలో గడిపాను. సంపాదించిన దానిలో సగం విదేశాలకు వెళ్లడానికే ఖర్చు చేశాను. వివాహానంతరం నా జీవితం తలకిందులైంది. ఇంటిని, స్థిరాస్తులను విక్రయించేశాను. నేను చేసిన మరో పెద్ద తప్పు ఇంటిని అమ్మడం. ఆ ఇల్లు నాకు చాలా ఆత్మస్ధైర్యాన్నిచ్చింది. అలాంటి ఇల్లు పోయిన తరువాత మానసికంగా, శారీరకంగా నష్టపోయాను. ఆవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని ధీనంగా అభ్యర్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు