వెయ్యి తలల అభిమానం 

19 Dec, 2018 00:01 IST|Sakshi

అభిమానం వెయ్యి తలలు వేస్తోంది. ట్విట్టర్‌లో ‘ట్రోలింగ్‌’ చేస్తోంది.  తెర పైన వంద మందిని కొట్టగల శక్తిమంతుడైన  తమ హీరోపై ఈగను వాలనివ్వని అభిమానులు,  చిన్న విమర్శను కూడా తట్టుకోలేనంత శక్తిహీనులుగా  తయారౌతున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సోషల్‌ మీడియాలో ‘కస్తూరి ఆర్మీ’ ఏర్పాటైంది.  కస్తూరిపై జరుగుతున్న ట్రోలింగ్‌ని ఆ ఆర్మీ తిప్పికొడుతోంది. 

నటి కస్తూరి తెలుసు కదా! భారతీయుడు, అన్నమయ్య సినిమాలు చూసినవాళ్లకు గుర్తుండే ఉంటుంది. ఈమధ్యే శమంతకమణి అనే ఓ తెలుగు సినిమాలోనూ నటించింది. ఇప్పుడు విషయం అది కాదు. తమిళ్‌ హీరో అజిత్‌ ఫ్యాన్స్‌ ఆమెను భయంకరంగా ట్రోల్‌ చేస్తున్నారు! కారణం.. ఆమె వాళ్లను ‘తలైవలి’ (తలనొప్పి) అని ట్వీట్‌ చేసినందుకు. అజిత్‌ను అతని ఫ్యాన్స్‌ అందరూ ‘తల (పెద్ద, నాయకుడు)’ అని అభిమానంగా పిలుచుకుంటారట. వలి అంటే తమిళంలో నొప్పి అని అర్థం. వాళ్ల నాయకుడి మీద ఈగ వాలనివ్వకుండా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తూ తలనొప్పిగా మారారని అలా ట్వీట్‌ చేసిందట. దాంతో కస్తూరి మీద ట్రోలింగ్‌ల శర పరంపరను మొదలుపెట్టారు అజిత్‌ ఫ్యాన్స్‌. పబ్లిక్‌గా ఆమె క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికలనూ జారీ చేస్తున్నారు. బెదిరింపులతో వీడియో మెస్సేజ్‌లనూ పంపించారు. ‘‘ఇండియన్‌ పీనల్‌ కోడ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (అమెండ్‌మెంట్‌ యాక్ట్‌) ప్రకారం ట్రోలింగ్‌ క్రిమినల్‌ యాక్ట్‌. శిక్ష పడ్తుందేమో అన్న భయంలేదా?’’ అని  అడిగితే ‘‘దీనికంతటికీ కస్తూరే బాధ్యురాలు. ఆమె లైమ్‌ లైట్‌లో ఉండడానికి అజిత్‌ ఫ్యాన్స్‌ను కామెంట్‌ చేయాల్సింది కాదు’’ అని తమ చర్యను సమర్థించుకుంటున్నారు అజిత్‌ ఫ్యాన్స్‌. 

విష సంస్కృతి
నచ్చితే గుడికట్టేయడం, నచ్చకపోతే పాతాళంలో పాతిపెట్టేయడం తమిళ అభిమాన సంస్కృతి, సంప్రదాయం. అదే సోషల్‌ మీడియాలోనూ కనిపిస్తోంది. అగ్ర హీరోల అభిమానుల మధ్య ఆన్‌లైన్‌ వార్‌ లాగిన్‌ అవుతోంది. దీనికి వెపన్‌ ట్రోలింగ్‌.  ఈ వార్‌ విజయ్, అజిత్‌ ఫ్యాన్స్‌ మధ్య మరీ తీవ్రంగా ఉంది. ఇప్పుడు కస్తూరి చేసిన ట్వీట్‌ను అజిత్‌ అభిమానులు ఎందుకంత మనసు మీదకు తీసుకున్నారంటే.. ‘అయ్యో ఈమె వల్ల విజయ్‌ అభిమానులకు చులకనై పోయామే’ అనే బాధతోనేనట. ట్రోలింగ్‌కు ఈ ఇద్దరి అభిమానులు పెట్టింది పేరు. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో అభిమాన హీరోల గురించి పరస్పరం వాదులాడుకుంటుంటారు. తిట్టుకుంటుంటారు. ఒకరి హీరోను ఇంకొకరు వెక్కిరిస్తూ, హేళన చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. ఎక్కడ ఎవరు ఈ ఇద్దరి గురించి కామెంట్‌ చేసినా ట్విట్టర్‌లో ట్రోలింగ్‌తో ‘ఫినిష్‌’ చేసేస్తారు.  కస్తూరి విషయంలో జరిగింది అదే.  ‘‘మాకు, విజయ్‌ ఫ్యాన్స్‌కి మధ్య ట్విట్టర్‌ వార్‌ జరుగుతోంది. కస్తూరి మమ్మల్ని అలా కామెంట్‌ చేయడం వల్ల విజయ్‌ ఫ్యాన్స్‌కి మేం దొరికి పోయినట్టేగా. మమ్మల్ని వాళ్లు ట్రోల్‌ చేయరా?’’ అంటాడు ఆవేశంగా ఓ అజిత్‌ అభిమాని. ఇంకా పరాకాష్ట ఏంటంటే నటుడు సిద్ధార్థ విషయంలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒక్కటవడం. సింగిల్‌ ట్రోలింగే ఇంత భయంకరంగా ఉంటే ఇద్దరూ కలిసి చేసే ట్రోల్‌ ఇంకెంత ఉత్పాతాన్ని సృష్టించగలదు.  ఈయేడు మార్చిలో తమిళ ఫిలిం ఇండస్ట్రీ స్ట్రైక్‌కి పిలుపునిచ్చింది. అయితే ఓ నాలుగు సినిమాలకు మాత్రం  షూటింగ్‌ జరుపుకోవడానికి తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అనుమతినిచ్చింది. అందులో విజయ్‌ నటించిన తలపతి 62 అనే సినిమా కూడా ఉంది. ఈ విషయం మీదే నటుడు సిద్ధార్థ ఓ కామెంట్‌ చేశాడు. అంతే విజయ్, అజిత్‌ అభిమానులు కలిసి సిద్ధార్థ మీద విరుచుకుపడ్డారు.  స్త్రీల విషయం వచ్చేసరికి ఈ ట్రోలింగ్‌ వాళ్ల వ్యక్తిగత విషయాల్లోకీ వెళ్తోంది. లైంగిక దాడుల హెచ్చరికలకూ వెనకాడ్డం లేదు. ట్రోలింగ్‌ అనేది చట్టరీత్యా నేరమని తెలిసినా వెరవడం లేదు. ‘‘సినిమా పరిశ్రమకు నమ్మకమైన ఆర్థిక వనరు అభిమానులే. అందుకే ఈ ట్రోలింగ్‌ కల్చర్‌ పట్ల సదరు హీరోలు చూసీచూడనట్టే వ్యవహరిస్తారు’’అంటున్నారు సినీ విశ్లేషకులు. ‘‘వీళ్లు వాళ్లు అని కాదు.. జనరల్‌గా కామెంట్‌ చేసిన ప్రతివాళ్లూ ట్రోల్‌ అవుతున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కి కారణమయ్యే పోస్ట్‌లను పెట్టకపోవడమే మంచిది. విజయ్, అజిత్‌లకు వేలల్లో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎంతమందికి అని కళ్లెం వేయగలరు? సాధ్యం కాని పని’’ అంటారు  ధనంజయన్‌ గోవింద్‌ అనే నిర్మాత, కాలమిస్ట్‌. 

కస్తూరి ఆర్మీ
కొసమెరుపు ఏంటంటే.. అజిత్‌ ఫ్యాన్స్‌ ఆగడాలను తట్టుకోవడానికి,  మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వడానికి సోషల్‌ మీడియాలో కస్తూరి ఆర్మీ అనే మద్దతు వర్గం తయారైంది నటి కస్తూరికి. డర్టీ అజిత్‌ ఫ్యాన్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కస్తూరికి సపోర్ట్‌ను పెంచే ప్రయత్నం చేస్తోంది. వి లవ్‌ అండ్‌ సపోర్ట్‌ కస్తూరి శంకర్‌ అని నినదిస్తోంది. అభిమానం కళ వరకే పరిమితం అయితే ఆ కళాకారుడి ఎదుగుదలకూ తోడ్పడుతుంది. అభిమానాన్ని ఇతరుల పట్ల ద్వేషంగా పంచుకుంటూ పోతే కళకే ఎండ్‌ కార్డ్‌ పడే ప్రమాదం ఉంది. నిర్మాత ధనంజయన్‌ గోవింద్‌ చెప్పినట్టు సదరు హీరోలు తమ వేల అభిమానులను కంట్రోల్‌ చేయలేకపోవచ్చు.. కానీ మహిళల పట్ల మర్యాదను నేర్పే స్వచ్ఛంద బాధ్యతను తలకెత్తుకోవచ్చు. తలైవాలు, తలలు తలచుకుంటే ఇదేం ఇంపాజిబుల్‌ కాదు. 

కస్తూరి తొలి వ్యక్తి కాదు

తమిళ సినిమా అగ్రహీరోల అభిమానుల ట్రోలింగ్‌కు గురైన వాళ్ల వరుసలో కస్తూరే మొదటి వ్యక్తి కాదు. కిందటేడు ధన్య రాజేంద్రన్‌ అనే జర్నలిస్ట్‌ (న్యూస్‌ మినిట్‌ ఎడిటర్‌) కూడా ఈ తరహా ట్రోలింగ్‌కు బలయింది. బాలీవుడ్‌ మూవీ ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ అనే సినిమా చూసి ‘‘ఈ సినిమా విజయ్‌ నటించిన సురా కన్నా ఘోరంగా ఉంది’ అని ట్వీట్‌ చేసింది. అంతే హీరో విజయ్‌ ఫ్యాన్స్‌ నుంచి రేప్‌ త్రెట్స్‌ మొదలయ్యాయి. ధన్యా రాజేంద్రన్‌ను అసహ్యించుకుంటూ, తిడుతూ దాదాపు 45 వేల ట్వీట్స్‌ పోస్ట్‌ చేశారు విజయ్‌ అభిమానులు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌ చేశారు. 

అజిత్, విజయ్‌ : వీళ్లు బాగానే ఉన్నారు. వీళ్ల అభిమానులూ బాగానే ఉన్నారు. ఎవరైనా మధ్యలోకి వస్తేనే ఇద్దరి ఫ్యాన్సూ ఒకటై.. మహిళలు అని కూడా చూడకండా ట్రోల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం వీళ్ల ట్రోలింగ్‌ నటి కస్తూరిపై నడుస్తోంది. 
– శరాది

మరిన్ని వార్తలు