అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

3 Apr, 2020 01:08 IST|Sakshi
లక్ష్మీరాయ్‌

‘‘21డేస్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నంత మాత్రాన కరోనా వైరస్‌ను జయించినట్లు కాదు. 22వ రోజు నుంచి కూడా కొంతకాలం కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలి’’ అంటున్నారు లక్ష్మీరాయ్‌. కరోనా వైరస్‌ నిరోధక చర్యలను పాటించకపోయినట్లయితే ఇంకా చెడు పరిణామాలు జరిగే అవకాశం ఉందని తనతో ఓ డాక్టర్‌ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఆ విషయాల గురించి ఓ లాంగ్‌ పోస్ట్‌ను ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌ సారాంశం ఈ విధంగా..

‘‘లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత దేశభక్తితో కొందరు రోడ్లపైకి వచ్చి కరోనా యుద్ధాన్ని గెలిచామని పెద్ద పెద్దగా అరుస్తారు. దేశభక్తి గీతాలను ప్లే చేస్తూ కొంతమంది, జాతీయ జెండాను పట్టుకుని మరికొంతమంది రోడ్ల పైకి వచ్చి విచ్చలవిడిగా వాహనాలను నడుపుతారు. మేం చదువుకున్నవారమంటూ చెప్పుకుంటున్న కొందరు లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే సినిమా హాల్స్, మాల్స్, పబ్లిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌లోకి వెళ్లి టైమ్‌ గడిపే ప్రయత్నం చేస్తారు.

అలాగే కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, చిన్న, మధ్యస్థాయి కంపెనీలు లాక్‌డౌన్‌ వల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడానికి తమ ఉద్యోగులకు అధిక పని గంటలను కేటాయించాలని చెప్పవచ్చు. కరోనాకు భయపడి ఇప్పటికే పట్టణాల నుంచి గ్రామీణప్రాంతాలకు చేరుకున్నవారు తిరిగి తమ ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రారంభించాలని పెద్ద ఎత్తున పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తారు. ఇలా అందరూ తమ తమ సాధారణ జీవితాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే 21డేస్‌ క్వారంటైన్‌లో ఉన్నాం కదా అని శానిటైజర్స్‌ను, మాస్క్‌లను పక్కనపెట్టేస్తారు. పరిశుభ్రంగా ఉండే విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు.

కానీ వీరిలో ఇంకా ఎవరికైనా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా, అవగాహన లేక కరోనా పరీక్షలు చేయించుకోకుండా ఉండి జనసంద్రంలో తిరిగినా.... మళ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి ప్రజలందరూ లాక్‌డౌన్‌ పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు. 21 రోజుల క్వారంటైన్‌ పూర్తయిన వెంటనే 22వ రోజు నుంచి కూడా కొంత కాలం సామాజిక దూరాన్ని, కరోనా వైరస్‌ను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను మర్చిపోకండి. ఒకవేళ వీటిపట్ల అశ్రద్ధగా ఉంటే ఇప్పటివరకు మనం పాటించిన 21డేస్‌ లాక్‌డౌన్‌ వృథా కావొచ్చు. 22వ రోజున ప్రజా రవాణా, ప్రజాజీవనం ఎలా ఉండాలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు లక్ష్మీరాయ్‌.

మరిన్ని వార్తలు