అందుకే ఆత్మహత్యాయత్నం చేశా: నటి

10 Sep, 2019 07:22 IST|Sakshi

చెన్నై నీటి సమస్య తీరాలని ప్రార్థించా

కమల్‌హాసన్‌ సైతం సమస్యపై చర్చించలేదు

టీవీ షోలో బిగ్‌బాస్‌ ఫేం మధుమిత

చెన్నై ,పెరంబూరు: బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో కార్యక్రమం ఎప్పుడూ రచ్చ రచ్చే. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌ 3లో అది కాస్త శృతి మించిందని చెప్పకతప్పదు. కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో సీజన్‌–3లో పాల్గొన్న సభ్యుల్లో హాస్య నటి మధుమిత ఒకరు. ఈ సీజన్‌లో ఈమె రచ్చే ఎక్కువ అయ్యింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ అమ్మడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, బయటకు వచ్చేసింది. అంనంతరం బిగ్‌బాస్‌ నిర్మాహకులు తన రావలసిన పారితోషికం చెల్లించలేదని ఆరోపణలు చేసి వివాదాల్లోకి ఎక్కింది. అయితే తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందో మధుమిత ఎక్కడా వెల్లడించలేదు.

నటి మధుమిత
అసలు విషయం అదే..
తాజాగా సోమవారం ఉదయం విజయ్‌ టీవీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి మధుమిత పాల్గొని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందన్నది తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15న హౌస్‌లో ఒక్కోక్కరికి ఒకో టాస్క్‌ ఇచ్చారని చెప్పింది. ఆ టాస్క్‌లో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని చెప్పారంది. తాను ఒక్క మాటలో కవితను చెప్పానని తెలిపింది. చెన్నైలో నీటి సమస్య గురించి తాను తరచూ దేవుని ప్రార్థిస్తానని చెప్పింది. టాస్క్‌లో కర్ణాటకలో కుంభవృష్టి కురుస్తున్నా, తమిళనాడుకు నీరు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని కవిత రూపంలో చెప్పానన్నారు. అందుకు ఇంటి సభ్యుల్లోని దర్శకుడు చేరన్, నటి కస్తూరి మినహా అందరూ వ్యతిరేకతను వ్యక్తం చేశారని అంది. అందుకు బిగ్‌బాస్‌ కూడా ఒక లేఖను పంపారనీ, అందులో ఇంటిలో రాజకీయాలు మాట్లాడకూడదని పేర్కొన్నారని చెప్పింది. అలా లేఖ రావడంతో చేరన్, కస్తూరి మినహా మిగిలిన 8మంది సభ్యులు తనను మరింతగా ఎగతాళి చేశారని తెలిపింది. ఒక గ్యాంగ్‌ రాగింగ్‌ మాదిరి ప్రవర్తించారని అంది. దాన్ని భరించలేకనే తాను కత్తితో చేతిని కోసుకుని ఆత్మహత్యానికి పాల్పడినట్లు వివరించింది. తాను నీటి సమస్య గురించి మాట్లాడటాన్ని తమిళులైన వారు కూడా రాజకీయం అంటూ వ్యతిరేకతను వ్యక్తం చేసిన ఆ ఎనిమిది మంది సభ్యులను తమిళులు బిగ్‌బాస్‌ గేమ్‌షో గెలవనీయరనే భావిస్తున్నానని అంది. అదే విధంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమలహాసన్‌ కూడా ఈ విషయం గురించి స్పందిచకపోవడం విచారకరమంది. ప్రజలు ఆయన నుంచి చాలా ఆశిస్తున్నారనీ, ఆయన మాట్లాడాల్సిందని మధుమిత పేర్కొంది.

దర్శకుడు చేరన్‌ ,సాక్షీ అగర్వాల్‌
నటి సాక్షీ అగర్వాల్‌ క్షమాపణ
కాగా ప్రేక్షకులను కుక్కలు అని అన్న నటి సాక్షీ అగర్వాల్‌ క్షమాపణ చెప్పింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లిన నటి సాక్షీఅగర్వాల్, అభిరామి, మోహన్‌ వైద్య గత వారం మళ్లీ అతిథులుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. అప్పుడు నటి షెరీన్‌కు దర్శన్‌కు మధ్య ప్రేమ అంటూ చేసిన వ్యాఖ్యలకు షెరిన్‌ ఆవేదన చెందింది. దీంతో నటి షెరిన్‌ను ఓదార్చిన నటి సాక్షీ ప్రేక్షకులను కుక్కలు అంటూ వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే చెలరేగింది. నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. కమలహాసన్‌ కూడా ఈ విషయాన్ని ప్రస్ధావించగా తాను ఆ అర్థంతో అనలేదని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. కాగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత తన ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రేక్షకులకు క్షమాపణ తెలిపింది. ఇకపై చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తానని చెప్పింది. ఇకపోతే ఆదివారం ఎలిమినేట్‌ అయిన దర్శకుడు చేరన్‌ను బిగ్‌బాస్‌ రహస్య గదిలోకి పంపారు. కొన్ని రోజుల తరువాత ఆయన మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు