ప్రేమించాలంటూ వెంటబడ్డారు!

21 Jun, 2014 23:54 IST|Sakshi
ప్రేమించాలంటూ వెంటబడ్డారు!

 తనను ప్రేమించాలంటూ ఎంతో మంది వెంటబడ్డారని నటి మాళవిక వేల్స్ తెలిపారు. కేరళ త్రిచూర్ నుంచి కోలీవుడ్‌కు కొత్తగా వచ్చిన ఈమె ఇంకా చాలా చెప్పారు. ‘‘నాకు భరతనాట్యం, కూచిపూడి, మోహినీయాట్టం తెలుసు. 2009లో మిస్ కేరళ పోటీలో ‘బ్యూటిఫుల్ ఐస్’ అవార్డు అందుకున్నాను. ఆ కార్యక్రమంలో నన్ను చూసిన వినీత్ శ్రీనివాసన్ ‘మలర్‌వాడి ఆర్ట్స్ క్లబ్’ అనే చిత్రంలో నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత కన్నడ చిత్ర అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘అళగు మగన్’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాను. తర్వాత ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో అవకాశం లభించింది. ఒకే ప్రసవంలో జన్మించిన అక్షితి, ఆప్తి, ఆకృతి, అతిథి అనే నలుగురు చిన్నారులతో నటించే అవకాశం లభించింది. చిత్రం ఈ నలుగురిపైనే కేంద్రీకృతమైంది. దర్శకుడు జయం రాజా, కాదల్‌మన్నన్ మా ను, నితిన్ సత్యాతో కలిసి నటించాను’’ అన్నారు మాళవిక వేల్స్.
 
  ఎంతో మంది మాళవికలు ఉన్నారుగా?

  తెలుసు. వాళమీను మాళవిక, అణ్ణి మాళవిక, మాళవికా నాయర్, మాళవికా మేనన్ అంటూ కొందరున్నారు. నాకిది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అందుచేత దీనిని మార్చేది లేదు. ఒక్కొక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాకు మాళవిక వేల్స్ అని ఉందిగా!
 
  గ్లామర్‌గా నటిస్తారా?
  కచ్చితంగా లేదు. త్రిచూర్‌లో భావన ఇంటి పక్కనే వుంది మా ఇల్లు. ఆమె నేను ఫ్రెండ్స్. ఇంతవరకు ఆమె గ్లామర్‌గా నటించలేదు. నాకు అదే ఉద్దేశం ఉంది. ఫ్యామిలీ ఇమేజ్ మాత్రమే కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే విధంగా నటించాలని ఆశపడుతున్నాను.
 
 డ్రీమ్ రోల్?
  పది చిత్రాల్లో నటించాను. ఈలోపున డ్రీమ్ రోల్ గురించి ఎలా చెప్పగలను. అలా దేనికీ ఫిక్స్ అవకూడదు. ఏ రోల్‌లో ప్రతిభను నిరూపించుకోగలమనే విశ్వాసం ఉందో, అందులో వంద శాతం నటన ప్రదర్శిస్తా. డ్యాన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. కేరళలో జరిగే ఉత్సవాల్లో నా భరతనాట్య ప్రదర్శనకు స్థానం ఉంటుంది.
 
 లవ్ చేశారా?
  ప్లస్ టూలో కొందరు వెంటబడ్డారు. వారిని అమ్మా, నాన్నల వద్దకు తీసుకువెళ్లి నిలబెట్టాను. తల్లిదండ్రులు వారికి ‘ఈ వయసులో ప్రేమేంటి? బుద్ధిగా చదువుకుని ముందుకు సాగండి!’ అంటూ సూచించారు. ఆ తర్వాత వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. మలయాళం, తమిళ్, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి.