సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిస్తా

22 Nov, 2014 02:32 IST|Sakshi
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిస్తా

అనారోగ్యాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటిస్తానని సీనియర్ నటీమణి మనోరమ దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో అందరూ అభిమానంగా ఆచ్చి అని పిలుచుకునే గొప్పనటి మనోరమ. ఎంజీఆర్, శివాజీగణేశన్‌ల కాలం నుంచి నటనే జీవితంగా ముందుకు సాగుతున్నారు. మనోరమ సుమారు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. నాయికగా, ముఖ్య పాత్రధారిగా, హాస్యపాత్రధారిగా, ప్రతినాయకిగా ఇలా ఆమె పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. మనోరమ నటించారంటే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరినట్లే.

మనోరమ హాస్యం పోషించారంటే ఆ చిత్రంలో నవ్వు లు విరబూయాల్సిందే. అంత అంకితభావం తో ఆమె నటిస్తారు. అలాంటి నటీమణి కొం తకాలం క్రితం బాత్‌రూమ్‌లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి పొందుతు న్న మనోరమ మళ్లీ మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి మనోరమ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె దయనీయ పరిస్థితి చూసి బాధేసిందంటూ వాపోయారు.

మనోరమకు తగిన వైద్య చికి త్స అందిస్తే ఆమె మరిన్ని చిత్రాల్లో నటిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మనోరమను కాపాడుకోవలసిన బాధ్యత ఆమె అభిమానులైన సినీ ప్రముఖలందరికీ ఉందంటూ ప్రకటించారు. మనోరమ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీని చూద్దాం... ‘నేను సినిమా రంగ ప్రవేశంచేసి 50 ఏళ్లు దాటింది. మొట్టమొదటిసారిగా సింహళ భాషా చిత్రంలో నటించాను. తమిళంలో ముల్లైతొట్ట మంగై చిత్రం లో పరిచయమయ్యాను. దివంగత ప్రఖ్యాత రచయిత కన్నదాస్ నన్ను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు.

ఆ తరువాత వరుసగా అన్ని భాషల్లోనూ నటించాను. ప్రస్తుతం పేరాండి అనే చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని నెలలుగా బయటకు వెళ్లడం లేదు. అలాంటిది సీనియర్ నటుడు ఎస్‌ఎస్ రవిచంద్రన్ కన్నుమూశారన్నవార్త విని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. నా ఆరోగ్యం బాగుండలేదని తెలిసి కొందరు సినీ ప్రముఖులు ఫోన్ చేస్తూ పరామర్శిస్తున్నారు. ఎంజీఆర్ జ్ఞాపక చిహ్నం, శివాజీ గణేశన్ ఇల్లు చూడడానికి వచ్చే అభిమానులు నన్ను చూడడానికి వస్తుంటా రు.

ఇది నాకెంతో మనశ్శాంతిని కలిగిస్తున్న విష యం. కమలహాసన్ జన్మదినం నాడు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. అప్పుడు కమ ల్ అమ్మలేని కొరతను తీర్చారు అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌లకు వెళ్లడం లేదు. ఇప్పుడిక నాకు కాలక్షేపం టీవీనే. నేను నటించిన పాత చిత్రాల సన్నివేశాలను చూస్తుంటే నాటి మధుర జ్ఞాపికలు గుర్తుకొస్తుంటాయి. నా కొడుకొకసారి నీ ఒంట్లో విషం చేరుతోందని చెప్పారు. తను అన్నట్లు గానే ఇప్పుడు జరిగింది. నా ఈ పరిస్థితి అశాశ్వతమే. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నటిస్తాను’ అంటూ మనోరమ తన మనసులోని మాటను బయటపెట్టారు.