దర్శకత్వం ఆలోచనలో పార్వతీ మీనన్‌..?

14 May, 2019 08:20 IST|Sakshi

ఒక కథను నిజాయితీగా చెప్పాలనుంది అని అంటోంది నటి పార్వతీమీనన్‌. ఈ మాలీవుడ్‌ నటి కోలీవుడ్‌లోనూ సుపరిచితురాలే. మలయాళంలో పలు చిత్రాల్లో నటించి కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న పార్వతీమీనన్‌. తమిళ చిత్ర పరిశ్రమలోకి ‘పూ’ చిత్రంతో పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరుతెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్‌ చిత్రంలో నటించింది. అయితే చాలా సెలక్టెడ్‌ చిత్రాలనే చేసే పార్వతీమీనన్‌ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. తాను అనుకుంది నిర్మొహమాటంగా చెప్పే మనస్థత్వం కలిగిన ఈ బ్యూటీ అలాంటి చర్యలతోనే ఆ మధ్య మాలీవుడ్‌లో వివాదాల్లో చిక్కుకుంది. అయినా నేనింతే అన్నట్టుగా తనకు వచ్చిన అవకాశాలనూ, తనకు నచ్చిన పాత్రలనే నటిస్తానని చెబుతోంది బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ బ్యూటీ.

సరే ఇంకేంటీ కొత్త విషయాలు అన్న ప్రశ్నకు మెగాఫోన్‌ పట్టనున్నానని చెప్పింది. ఏంటీ సడన్‌ నిర్ణయం అని అంటే ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, దర్శకత్వం చేయాలన్నది చాలా కాలంగా తనలో నిగూఢమైన కోరిక అని పేర్కొంది. దర్శకత్వం చేయాలన్నది తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలన్న ఆసక్తి మాత్రం కాదని, నిజాయితీతో కూడిన కథను వెండితెరపై చూపించాలన్న కోరికనేనని చెప్పింది. ప్రస్తుతం అందుకు సన్నాహాలు చేస్తున్న నటి పార్వతీమీనన్‌ వచ్చే ఏడాది మెగాఫోన్‌ పట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ చిత్రం మాతృభాషలోనే ఉంటుందా? లేక తమిళంతో కలిపి రెండు భాషల్లో చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరిన్ని వార్తలు