‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’

2 May, 2020 19:31 IST|Sakshi

‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు మరికాస్త మసాల దట్టించి తమకు నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు. ఇలాంటి వార్తల బారిన పడ్డారు హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో పాయల్‌కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టారు పాయల్‌.   

‘గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. ఇది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేపించారు. వైద్య పరీక్షల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్‌ త్వరలోనే ముగుస్తుందని బలంగా విశ్వసిస్తున్నా. అతిత్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నా నమ్మకం’అంటూ పాయల్‌ పేర్కొన్నారు. పాయల్‌ తెలుగులో మంచు మనోజ్‌తో  ‘ప్రయాణం’ , ఎన్టీఆర్‌తో కలిసి ‘ఊసరవెల్లి’ సినిమాలో చిత్రగా కనిపించిన విషయం తెలిసిందే. 

చదవండి:
సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌
మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్‌

మరిన్ని వార్తలు