డైనమైట్ లాంటివి ఎప్పుడో కానీ దొరకవు

27 Aug, 2015 23:29 IST|Sakshi
డైనమైట్ లాంటివి ఎప్పుడో కానీ దొరకవు

 ‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం’’ అంటున్నారు ప్రణీత. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానంటున్నారీ కన్నడ భామ. దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు సరసన ఆమె నటించిన ‘డైనమైట్’ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణీతతో జరిపిన ఇంటర్వ్యూ...


 
 ‘డైనమైట్’లో రిస్కీ ఫైట్స్ చేశారట..?
 మామూలుగా యాక్షన్ సినిమాలంటే హీరోయిన్‌ని విలన్ తోసేయగానే ఫ్రేమ్ నుంచి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోపై యాక్షన్ సీన్స్ తీస్తారు. ఈ చిత్రంలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌లో హీరోయిన్ ఉంటుంది. అది నాకు నచ్చింది. ఇలాంటి పాత్రలు ఎప్పుడో కానీ రావు.
 
 ఆ యాక్షన్ సీన్స్‌లో మీకు దెబ్బలేమైనా తగిలాయా?
 బాగా తగిలాయి. ఒకసారి మోకాళ్లయితే నీలం రంగులోకి మారిపోయాయి. విలన్ నన్ను వెంటాడుతుంటే నేను కూరగాయల బండి మీద నుంచి దూకాలి. అప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఓ ఫైట్ తీస్తున్నప్పుడు గోరుకి ఘోరమైన దెబ్బ తగిలింది. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి దెబ్బలు కామన్. ఈ సీన్స్ తీసే ముందు చాలా రిహార్శల్ చేశాం. కానీ, ఎంత రిహార్శల్స్ చేసినా సీన్స్ తీసేటప్పుడు అనుకోకుండా దెబ్బలు తగులుతుంటాయి.
 
 ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర?
 మోడ్రన్ అమ్మాయిని. ఇప్పుడు సిటీ అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయిని. ఆ అమ్మాయిని హీరో ఓ సందర్భంలో కలుస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. ఆ ట్రావెల్ ఎందుకు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
 ఈ సినిమాతో సోలో హీరోయిన్‌గా మీకు ప్రమోషన్ లభిస్తుందనుకుంటున్నారా?
 లభిస్తుందనే అనుకుంటున్నాను. సోలో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత మంచి సినిమాలో చేసినందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కథలో నా పాత్రక్కూడా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో ఫైట్స్ జరిగేదంతా హీరోయిన్ కోసమే. కథలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది.
 
 ఎలాగూ ఈ చిత్రంలో చిన్న చిన్న ఫైట్స్ చేశారు కాబట్టి, ఇక పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలొస్తే చేస్తారన్న మాట?
 యాక్చువల్‌గా నాకు ఫైట్స్ చేసే సీన్ లేదు. అందుకే, డూప్‌తో చేయిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ, విజయన్ మాస్టర్ ‘నువ్వు చేయగలవ్’ అంటూ చేయించారు. యాక్షన్ అంటే ఏదో భారీగా చేయలేదు. విలన్ తోసేసినప్పుడు పడిపోవడం కూడా యాక్షనే. అలా పడటం మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ సినిమాలో నేను చేసిన చిన్న చిన్న యాక్షన్ సీన్స్‌ని బాగా రిసీవ్ చేసుకుంటే, అప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గురించి ఆలోచిస్తా.
 
 ‘డైనమైట్’లో మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏది?
 కొన్ని టేబుల్స్ వరుసగా ఉంటాయి. విష్ణు నన్ను కాపాడటానికి తోస్తారు. అప్పుడు నేను టేబుల్ కింద నుంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి. ఆ సీన్‌కి ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ఈ చిత్రం షూటింగ్ చేసినప్పుడు ఉదయం నిద్ర లేవగానే, ‘ఈరోజు బిల్డింగ్ నుంచి దూకడమా? పరిగెత్తడమా? ఏం చేయమని చెబుతారో’ అనుకుంటూ షూటింగ్‌కి రెడీ అయ్యి వెళ్లేదాన్ని. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండేది.
 
 హీరో విష్ణు గురించి చెప్పండి?
 విష్ణు చాలా డిఫరెంట్. ఆయన ఆలోచనలన్నీ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయి. ఎక్కువ హాలీవుడ్ చిత్రాలు చూస్తారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ అయితే ఎక్స్‌లెంట్. ఆయనతో పాటు ట్రైనర్ కూడా ఉండేవారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విష్ణు చాలా వర్కవుట్స్ చేశారు. నేను కూడా తన నుంచి కొన్ని టిప్స్ తీసుకున్నాను.
 
 దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
 దేవా కట్టా ఆలోచనలు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఇది తమిళ చిత్రానికి రీమేక్. తెలుగుకి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే చేశారు. అలాగే, మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు.
 
 సెకండ్ లీడ్ రోల్స్‌పై మీ అభిప్రాయం?
 మెయిన్, సెకండ్ లీడ్ రోల్స్ గురించి నేనెలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వను. నాకిచ్చిన పాత్రను నేను చక్కగా క్యారీ చేయగలనా? లేదా అని చూసుకుంటాను. ఈ మధ్య సూర్యగారు చేసిన ‘రాక్షసుడు’లో నాది చాలా చిన్న పాత్ర. కానీ, థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు నా పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను.
 
 లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా?
 చేస్తాను. హీరో ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు హీరోయిన్‌కి కూడా ప్రాధాన్యం ఉంటే బాగుంటుంది. ‘డైనమైట్’ అలాంటి చిత్రమే. ఇందులో నా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టే, నేనీ చిత్రం గురించి ఇంతగా మాట్లాడగలుగుతున్నాను.
 
 తెలుగు బాగా మాట్లాడుతున్నారు... త్వరలో మీ పాత్రకు డబ్బింగ్ చెప్పేస్తారా?
 నా స్టాఫ్‌కి తెలుగు తప్ప వేరే తెలియదు. వాళ్లతో మాట్లాడటంవల్ల నాక్కూడా తెలుగు వచ్చేసింది. డబ్బింగ్ గురించి భవిష్యత్తులో ఆలోచిస్తాను.