ఆమెను క్షమాపణ అడిగా!

17 Mar, 2016 02:05 IST|Sakshi
ఆమెను క్షమాపణ అడిగా!

 నటి రాయ్‌లక్ష్మిని క్షమాపణ అడిగానంటున్నారు వర్ధమాన నటుడు లింగేష్. ఎందుకు క్షమాపణ అడిగారు? ఆమెను ఏమి చేశారు? ఏమాకథ తెలియాలంటే ఆయనే పలకరిద్దాం. నా పేరు లింగేష్. నేను మెకానిక్ ఇంజినీరింగ్ పట్టబద్రుడిని. అయితే సినిమా నా కల. చదువుకునే రోజుల నుంచే నటన, డాన్స్ అంటే ఆసక్తి. ఇంటర్ చదువుకునే రోజుల్లోనే స్టేజ్ ప్రోగ్రామ్‌లో డాన్స్ చేసి బహుమతులు అందుకున్నాను.ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత నటన, డాన్స్ మరీ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక లాభం లేదని రాడాన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను.
 
 అదే విధంగా శోభి మాస్టర్‌తో పాటు మరికొంత మంది వద్ద డాన్స్ నేర్చుకున్నాను.ప్రముఖ నృత్యకళాకారుడు మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. ఇంకా వెస్ట్రన్ డాన్స్‌తో పాటు, కుంగ్‌ఫూలో కూడా శిక్షణ పొందాను. నటుడికి ఇవన్నీ అవసరం అని తెలుసు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను.ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్, కే.విశ్వనాథ్‌ల సన్మాన వేదికపై స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రశంసలు పొందాను. ఇక నటుడిగా నిరూపించుకునే తరుణం వచ్చింది. ప్రముఖ నటి కుట్టిపద్మిని భక్తవిజయం అనే సీరియల్‌లో హీరోగా నటించే అవకాశం కల్పించారు.
 
  అందులో కృష్ణ చైతన్య మహాప్రభుగా నటించాను. నా కల ఇది కాదు అనుకుంటున్న సమయంలో షావుకార్‌పేట్టై చిత్రంలో నటించే అవకాశం వరించింది. శ్రీకాంత్,రాయ్‌లక్ష్మి హీరోహీరోయిన్లగా నటించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడం జీవితంలో మరచిపోలేని అనుభవం. ఇందులో సీనియర్ నటుడు సుమన్‌కు కొడుకుగా నటించాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక శ్రీకాంత్ నన్ను చిన్నవాడిగా భావించకుండా చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నారు. నటి రాయ్‌లక్ష్మి పెద్ద మనసుకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమెతో ఫైట్ చేసే సన్నివేశంలో తన చేతిని తాను మెలివేసి తిప్పాలి. ఆ సన్నివేశాన్ని నాలుగైదు సార్లు  చేయాల్సివచ్చింది. అప్పుడు రాయ్‌లక్ష్మిని క్షమాపణ కోరాను. ఆమె అదేమీ పట్టించుకోకుండా నటించడం మన వృత్తి అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆకాంక్ష.