ప్రశాంతంగా ఉండు సుశీ...

15 Jul, 2020 03:15 IST|Sakshi

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం ఎంతోమందిని బాధించింది. గత నెల 14న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ మృతి చెంది నిన్నటికి (మంగళవారం, జూలై 14) నెల రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నటి రియా చక్రవర్తి (సుశాంత్, రియా ప్రేమలో ఉండేవారని వార్తలు వచ్చేవి. ఈ పోస్ట్‌ వారి అనుబంధాన్ని తెలియజేస్తోంది) ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ సారాంశం ఈ విధంగా... ‘‘నువ్వు (సుశాంత్‌) లేవనే నిజాన్ని నమ్మలేక నా భావోద్వేగాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. నా హృదయంలోని అలజడి నన్ను ఇంకా కలవరపెడుతూనే ఉంది.

ప్రేమ పట్ల నమ్మకాన్ని కలిగించింది, దాని శక్తిని నాకు తెలిసేలా చేసింది నువ్వే. ఓ చిన్న గణితసూత్రం మన జీవితాలను ఎలా ప్రతిభింబిస్తుందో చెప్పి, జీవితం గురించి నాకు అర్థం అయ్యేలా చేసింది నువ్వే. నీ జ్ఞాపకాల నుంచి ప్రతిరోజూ నేను ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటానని నీకు మాట ఇస్తున్నాను. ప్రతి అంశాన్ని ఎంతో మంచి మనసుతో ప్రేమించే వ్యక్తివి నువ్వు. ప్రస్తుతం ఎంతటి ప్రశాంత వాతావరణంలో నువ్వు ఉన్నావో నాకు తెలుసు. చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు ఓ గొప్ప భౌతికశాస్త్రవేత్త మా వద్దకు వచ్చాడని చప్పట్లతో స్వాగతించి ఉంటాయి. అక్కడ నువ్వు ఓ షూటింగ్‌ స్టార్‌గా వెలుగుతూనే ఉంటావని ఆశిస్తున్నాను. నా షూటింగ్‌ స్టార్‌ మళ్లీ నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. మన మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి నాకు మాటలు సరిపోవు. నువ్వు దూరమై ముప్పై రోజులవుతోంది. నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ప్రశాంతంగా ఉండు సుశీ ’’ అని పేర్కొన్నారు రియా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా