నేనెందుకు సిగ్గుపడాలి?

17 Apr, 2017 03:32 IST|Sakshi
నేనెందుకు సిగ్గుపడాలి?

నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఎదురుప్రశ్న వేస్తోంది ఉత్తరాది భామ రితికాసింగ్‌. ఈ కుస్తీ రాణి నటిగా పరిచయమై తొలి చిత్రం ఇరుదుచుట్రు చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకున్న లక్కీ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నీ సక్సెసే. తాజాగా రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ కూడా విజయబాట పట్టడంతో యమ ఖుషీగా ఉన్న రితికాసింగ్‌తో చిట్‌చాట్‌.

ప్ర: శివలింగ చిత్రంలో నటించిన అనుభవం?
జ: పి.వాసు దర్శకత్వంలో రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన చిత్రం శివలింగ. మొదట కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక నాయకిగా నటించారు. ఆమె చాలా బాగా నటించారు. అదే పాత్రలో నటించే అవకాశం రావడం చాలా సంతోషం. నా నటనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభవం. శివలింగ చిత్రంలో వేరే రితికాసింగ్‌ను చూస్తారు.

ప్ర: శివలింగ చిత్రంలో అందాలారబోశారట?
జ: పాటల్లో గ్లామర్‌ అవసరం అవడంతో అలా నటించాల్సి వచ్చింది. అయితే చిత్రం చూసేవారికి గ్లామరస్‌ అనిపించదు. అయితే రాఘవ లారెన్స్‌తో కలిసి డాన్స్‌ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా చీర ధరించి డాన్స్‌ చేయడానికి నేను పడ్డ అవస్థలు చెప్పనలవికాదు. చీరలో డాన్స్‌ చేసేటప్పుడు ఎన్ని సార్లు కింద పడ్డానో నాకే తెలియదు. అంతకు ముందు నేనెప్పుడూ చీర ధరించలేదు. అందులో కష్టమున్నా, అదో సరికొత్త అనుభవం అనే చెప్పాలి.

ప్ర: బాక్సింగ్‌ కష్టమా, నటన కష్టమా?
జ: నేను మూడేళ్ల వయసు నుంచే కరాటే, బాక్సింగ్‌ నేర్చుకున్నాను. అందువల్ల నాకు బాక్సింగ్‌ కష్టం కాదు. సినిమాల్లో నటించడమే కష్టం. నటన, డాన్స్‌ను నేనింకా నేర్చుకోవాలి.

ప్ర: మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పారా?
జ: ఎందుకో తెలియదు గానీ చాలా మంది నా దగ్గరకు రావడానికే భయపడుతుంటారు. ఇక సినిమా రంగంలో నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి ఐ లవ్‌యూ చెబితే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పి పంపేస్తాను. ఇక నాకూ ప్రేమించడానికి టైమ్‌ లేదు.

ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ఫుడ్‌?
జ: విడియాప్పం, రసం, అప్పళం ఇష్టంగా తింటాను. కొంచెం నాన్‌ వెజ్‌ కూడా లాగించేస్తాను.

ప్ర: మీకు సిగ్గు పడడం తెలుసా?
జ: నిజంగా తెలియదు. అయినా నేనెందుకు సిగ్గుపడాలి. వివాహసమయంలో కల్యాణ వేదికపై కూడా నేను సిగ్గు పడను. ఒక వేళ సిగ్గు పడాలన్నా అది నాకు రాదని అంటోంది  కుస్తీరాణి.

>