ఆమే నన్ను మోసం చేసింది!

31 Oct, 2014 23:15 IST|Sakshi
ఆమే నన్ను మోసం చేసింది!

నాగార్జున ‘గగనం’, కల్యాణ్‌రామ్ ‘కత్తి’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ చిత్రాల్లో నటించిన సనాఖాన్ మనవాళ్లకు పరిచయమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే నటి ఆమె. వ్యక్తిగత విషయాలను మీడియాకు లీక్ చేశారని ఆరోపిస్తూ, మీడియా కన్సల్టెంట్ అయిన ఒక మహిళపై దాడి చేసినందుకు గాను సల్మాన్‌ఖాన్ ‘జై హో’ చిత్ర ఫేమ్ సనా ఖాన్‌నూ, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్‌నూ ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో వారిని ఆనక జామీనుపై విడుదల చేశారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సనా ఖాన్ వాదన మాత్రం మరోలా ఉంది. నిజానికి, మీడియా కన్సల్టెంట్ అయిన పూనమ్ ఖన్నాయే తమను మోసం చేశారంటున్నారు.
 
 ‘‘ఆధ్యాత్మిక శక్తులున్న వ్యక్తిలా నటిస్తూ, పూనమ్ ఖన్నా మాకు దగ్గరయ్యారు. మా కుటుంబంలో నేనొక్కదాన్నే సంపాదనపరురాలిని కావడంతో, భవిష్యత్తు కోసం స్థిరాస్తులు కొనాలనుకున్నాను. అక్కడ కూడా డబ్బుల విషయంలో ఆమె మమ్మల్ని నమ్మించి, మోసం చేశారు. విషయం తెలిసి ఆమెకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నా. నా డబ్బులు వాపసు ఇవ్వాల్సిందిగా అడిగినప్పుడల్లా ఆరోగ్యం బాగా లేదంటూ ఆసుపత్రిలో చేరుతోందామె’’ అని సనా ఖాన్ వాదిస్తున్నారు. పూనమ్ చేతుల్లో ఇప్పటికే చాలా మంది మోసపోయారనీ, ఆమెపై ఇప్పటికే 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ వ్యవహారం చివరికంటా తేల్చుకుంటాను. నిజం నిరూపిస్తాను’’ అని ఈ నటి అంటున్నారు. మొత్తానికి, సనా ఖాన్ వాదనతో కథ కొత్త మలుపు తిరిగింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి