త్వరలో పెళ్లి చేసుకుంటా!

31 Aug, 2017 03:03 IST|Sakshi
త్వరలో పెళ్లి చేసుకుంటా!

తమిళసినిమా: నటి శ్రియకు పెళ్లిపై దృష్టి మళ్లినట్టుంది. త్వరలోనే వివాహం చేసుకుంటానంటోంది. ఈ అమ్మడు నటిగా దశాబ్దన్నర కాలాన్ని టచ్‌ చేసింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన శ్రియ ఆ తరువాత జయంరవికి జంటగా మళై చిత్రంలో నటించింది. అలా తక్కువ కాలంలోనే స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అదే విధంగా తెలుగులో ఇష్టం చిత్రంతో పరిచయమైన శ్రియ అక్కడ కూడా వేగంగానే స్టార్‌డంను అందుకుంది.

ఇలా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తూ బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ హీరోయిన్‌గా రాణిస్తున్నా, అంత క్రేజ్‌ మాత్రం లేదనే చెప్పాలి. తాజాగా బాలకృష్ణతో నటించిన తెలుగు చిత్రం పైసావసూల్‌ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక భేటీలో శ్రియ పేర్కొంటూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నానని వెల్లడించింది. తాను తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ప్రముఖ కథానాయికిగా వెలుగొందుతున్నానని అంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది.

తానిప్పటికీ నటనను ప్రేమిస్తున్నానని, వృత్తిని గౌరవించేవాళ్లకు అది ఎప్పటికీ బోర్‌ కొట్టదని అంది. తానిక్కడ ఒంటరిగానే జయించానని చెప్పింది. తనకిక్కడ చేదు అనుభవాలెప్పుడూ ఎదరవలేదని అంది. నటిగా ఎలా నిలదొక్కుకోగలనా అని మొదట్లో సంకట పడ్డా సహ నటీనటులు, దర్శక నిర్మాతల సహకారంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పింది. తనను చాలా మంది పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారని, స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యం అని పేర్కొంది. తనకు త్వరలోనే వివాహం జరుగుతుందని, మనసుకు నచ్చినోడు తారస పడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

తనకు కాబోయే భర్త మంచి స్నేహితుడై ఉండాలని అంది. ముందున్న జీవితం కూడా మంచి సాగిపోవాలని అంది. ఇకసోతే చాలా మంది తన అందంలోని రహస్యం ఏమిటని అడుగుతుంటారని, తన అందానికి ప్రధాన  కారణం యోగానేనని చెప్పింది. యోగా తన జీవితంలో చాలా మార్చు తీసుకొచ్చిందని, ఉద్రేకాలను అదుపు చేసుకోవడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అంది. అదే విధంగా ధ్యానం కూడా చేస్తానని తెలిపింది. ఈ తరం యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవడం బాధగా ఉందని, ఎలాంటి చెడు అలవాట్లకు అలవాటు పడకుండా యువత చక్కగా చదువుపైనే దృష్టి సారించాలని హితవు పలికింది. కుటుంబంలో ఒక్కరు డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆ కుటుంబం అంతా బాధింపునకు గురవుతుందన్నది తెలుసుకోవాలని శ్రియ పేర్కొంది.