ఎన్ని వివాదాలు వస్తే అంత మంచిది!

8 Aug, 2015 00:16 IST|Sakshi
ఎన్ని వివాదాలు వస్తే అంత మంచిది!

‘‘వర్కింగ్ స్టయిల్ పరంగా నార్త్‌కి, సౌత్‌కి చాలా తేడా ఉంది. దక్షిణాదిన ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక నియమం ప్రకారం పని చేస్తూ ఉంటారు. కానీ, ఉత్తరాదిన అలా కాదు... తమకు నచ్చినట్లు పని చేస్తారు’’ అని లక్ష్మీరాయ్ అంటున్నారు. తమిళ చిత్రం ‘మౌన గురు’ హిందీ రీమేక్ ‘అకీరా’ ద్వారా ఆమె బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సొనాక్షీ సిన్హా కథానాయిక. ఇందులో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేస్తున్నారు.

బాలీవుడ్ వర్కింగ్ స్టయిల్ కొత్తగా ఉందని, కానీ ఎంజాయబుల్‌గా ఉందని లక్ష్మీ రాయ్ చెబుతూ - ‘‘సౌత్‌లో వివాదాలంటే కంగారుపడతారు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడతారు. కానీ, నార్త్‌లో అలా కాదు. వివాదాలను కోరుకుంటారు. ఎన్ని వివాదాలొస్తే అంత మంచిదని, బోల్డంత పాపులార్టీ వస్తుందని భావిస్తారు. కానీ, నేను మాత్రం పాపులార్టీ కోసం వివాదాలు కోరుకోవడంలేదు’’ అన్నారు. ‘అకీరా’లో చేస్తున్నది అతిథి పాత్రే అయినా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి లక్ష్మీరాయ్‌కి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని, అధికారికంగా సైన్ చేసిన తర్వాత ఆ చిత్రాల వివరాలు తెలియజేస్తానని లక్ష్మీ రాయ్ చెప్పారు.