బిడ్డ కోసం సినీనటి వనిత పోరాటం

8 Jun, 2019 08:56 IST|Sakshi

చెన్నై: బిడ్డల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏ తల్లికి రాకూడదని ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్, తిరువళ్లూరు జిల్లా పూందమల్లిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ఆనందరాజ్‌తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జెనీతా(10) అనే కుమార్తె ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. జెనీతా హైదరాబాద్‌లో నివాసం వుండేది. 

ఈ నేపథ్యంలో 2012లో తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించిన వనిత, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నారిని తనతో పాటు తీసుకొచ్చింది. దీంతో ఆనందరాజ్‌ హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెను భార్య వనిత కిడ్నాప్‌ చేసిందని ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కేసు నమోదు చేశారు. భార్య వద్ద నుంచి కుమార్తెను అప్పగించాలని పోలీసులను కోరారు. 

ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన వనిత విజయకుమార్‌ జెనీతాకు తాను అమ్మనని, ప్రస్తుతం తనతోనే ఉందని..చిన్నారిపై పూర్తి హక్కును తనకు అప్పగించాలని కోరుతూ పూందమల్లి కోర్టులో ప్రత్యేక  పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సంబంధిత కేసును  పూందమల్లి నుంచి తిరువళ్లూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. 

ఈ కేసు విచారణ శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సెల్వనాథన్‌ ఎదుట సాగింది. విచారణకు ఆనందరాజ్‌ హాజరు కాకపోవడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వనిత విజయకుమార్, తన బిడ్డ కోసం కోర్టు మెట్లు ఎక్కానని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు. తనకు న్యాయం జరుగుందనే నమ్మకం ఉందన్నారు.  

మరిన్ని వార్తలు