ముగ్గురిలో రాణీ సంఘమిత్ర ఎవరు?

1 Jun, 2017 23:38 IST|Sakshi
ముగ్గురిలో రాణీ సంఘమిత్ర ఎవరు?

టైమ్‌ లేదు... ఇప్పుడు ఇంకో హీరోయిన్‌ను లండన్‌ పంపించి మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ ఇప్పించేంత టైమ్‌ ‘సంఘమిత్ర’ టీమ్‌ దగ్గర లేదు. ఎందుకంటే... షూటింగ్‌ షెడ్యూల్స్‌ దగ్గర పడుతున్నాయి. ఒకవేళ అంత రిస్క్‌ తీసుకునే గట్స్‌ ఉన్నా... ఇప్పటికిప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కి, షూటింగ్‌కి బోలెడంత టైమ్‌ కేటాయించే స్టార్‌ హీరోయిన్లు ఎవరున్నారు? అందుకే ఆల్రెడీ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ, మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకున్న హీరోయిన్‌ అయితే బాగుంటుందని ‘సంఘమిత్ర’ టీమ్‌ ఆలోచనగా తెలుస్తోంది.

సడన్‌గా శ్రుతీహాసన్‌ సినిమా నుంచి తప్పుకోవడంతో ‘సంఘమిత్ర’ దర్శకుడు సుందర్‌ .సి, చిత్రనిర్మాణ సంస్థ తేనాండాళ్‌ స్టూడియోస్‌ కొత్త హీరోయిన్‌ వేటలో పడ్డారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయనున్నారు కనుక... మూడు భాషల ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్‌ గురించి అన్వేషిస్తున్నారని టాక్‌. వాళ్లకు ముగ్గురు హీరోయిన్లు మెయిన్‌గా కనిపిస్తున్నారట. వాళ్లే... అనుష్క, తమన్నా, హిందీ హీరోయిన్‌ దీపికా పదుకొనె. రాణీ సంఘమిత్ర పాత్రకు ఈ ముగ్గురూ కరెక్ట్‌గా సూటవుతారని యూనిట్‌  భావిస్తోందట! వాళ్లతో సంప్రదింపులు కూడా షురూ చేశారని సమాచారం. సో, ముగ్గురిలో రాణీ సంఘమిత్ర ఎవరు? అనేది త్వరలో తెలుస్తుంది. వీళ్లలో ఎవరో ఒకరు కాకుండా మరొకరు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.