బోగస్‌ సంస్థలతో మోసపోవద్దు

21 Mar, 2017 00:25 IST|Sakshi
బోగస్‌ సంస్థలతో మోసపోవద్దు

‘‘తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందాయి. కొందరు వీటి అనుబంధ పేర్లతో బోగస్‌ సంస్థలు ఏర్పాటు చేసి కొత్త నిర్మాతలను మోసగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్‌ సంస్థల వలలో పడి మోసపోవద్దు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు సి.కల్యాణ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు రామ్మోహన్‌ రావు అన్నారు.

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘బోగస్‌ సంస్థలపై నిఘా ఉంచేందుకు ‘అడ్‌హక్‌’ కమిటీ ఏర్పాటు చేశాం. కొత్త నిర్మాతలు ఎవరైనా తెలుగు ఫిలిం ఛాంబర్‌ లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి. ఎలాంటి గుర్తింపు లేని బోగస్‌ సంస్థల్లో సభ్యత్వం తీసుకుని, మోసపోతే న్యాయం చేయలేం.

సినిమా అవార్డులన్నవి ప్రభుత్వాలు ఇస్తేనే బాగుంటుంది కానీ, సంస్థలు కాదు. ఇల్లీగల్‌ వ్యవహారాల్లో కౌన్సిల్‌ జోక్యం చేసుకోదు’’ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి మురళీమోహన్, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, జాయింట్‌ సెక్రటరీ ఏడిద శ్రీరాం, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

>