ఇప్పుడు ఆ భయమే లేదు

30 Jun, 2019 00:15 IST|Sakshi
అదా శర్మ

‘‘సినిమాలో నా స్క్రీన్‌ టైమ్‌ ఎంతసేపు?’ అని ఆలోచించే యాక్టర్‌ని కాదు నేను. మనకిచ్చిన రోల్‌లో, మనకున్న స్క్రీన్‌ టైమ్‌లో ఒప్పుకున్న పాత్రకు, ఆ సినిమాకు మనమేం కొత్తదనం తీసుకురాగలం అని మాత్రమే ఆలోచిస్తాను. యాక్టర్‌గా చేసే ప్రతిదీ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ అయ్యుండాలనీ సినిమా మొత్తం కనిపించాలనీ అనుకోను’’ అన్నారు అదా శర్మ. రాజశేఖర్, అదా శర్మ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా అదా శర్మ పలు విశేషాలు పంచుకున్నారు.

► ప్రశాంత్‌ డైరెక్ట్‌ చేసిన ‘అ!’ సినిమా నచ్చింది. తనతో సినిమా చేయాలనుకున్నా. ప్రశాంత్‌ ‘కల్కి’ కథ చెప్పగానే నచ్చింది. హీరోయిన్‌ పాత్రలను ఆయన విభిన్నంగా రాస్తారు. ఈ సినిమాలోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిసారి డాక్టర్‌ పాత్ర చేశా. ఈ పాత్ర అన్నీ కళ్ల ద్వారానే వ్యక్తపరుస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాను నేను. అందుకే ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఇది పీరియాడికల్‌ మూవీ కాబట్టి రిఫరెన్స్‌ కోసం కొన్ని పాత సినిమాలు చూశాను. అప్పటి హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది? అనే విషయాలను గమనించాను. పాత తరం నటీమణుల్లో వహీదా రెహమాన్, వైజయంతి మాల నాకు ఇష్టమైన హీరోయిన్లు.

► రాజశేఖర్‌గారిలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న యాక్టర్‌తో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ తొలి సినిమా చేస్తున్న హీరోకి ఉండే ఎగై్జట్‌మెంట్‌తో ఈ సినిమాకు వర్క్‌ చేశారాయన. తను సీనియర్, నేను జూనియర్‌ అనే ఫీలింగ్‌ సెట్లో ఎప్పుడూ లేదు. చాలా పాజిటివ్‌ పర్సన్‌.

► ‘క్షణం’ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను.  తెలుగు సినిమాలు వరుసగా ఎందుకు చేయడం లేదని తెలుగు ఫ్యాన్స్‌ అడుగుతుంటారు. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. సో.. హిందీలో వరుసగా రెండు సినిమాలు చేస్తే తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా చేయాలి, ఆ తర్వాత హిందీ సినిమా చేయాలి అనే స్ట్రాటజీతో ప్లానింగ్‌ చేయలేను.  

► ప్రస్తుతం హిందీలో ‘కమాండో 3’, మ్యాన్‌ టు మ్యాన్‌’ సినిమాలు కమిట్‌ అయ్యాను. ‘కమాండో’ సిరీస్‌లో వస్తున్న మూడో  చిత్రమిది. సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాల్లో హీరోయిన్స్‌ను మారుస్తారు. కానీ మూడో సినిమాలోనూ నేనే హీరోయిన్‌గానే కొనసాగుతున్నాను. ‘మ్యాన్‌ టు మ్యాన్‌’లో అబ్బాయిగా నటిస్తున్నాను. వీటితో పాటు ఓ వెబ్‌ సిరీస్, రెండు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటిస్తున్నాను.

► నా వర్క్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తాను. ఎందుకంటే యాక్టర్‌ అవ్వాలన్నది నా డ్రీమ్‌. కొందరు వాళ్ల ప్రొఫెషన్‌ని ఇష్టపడరు. ఉదయాన్నే లేచి అబ్బా.. ఇవాళ కూడా ఆఫీస్‌కి వెళ్లాలా? అని బాధపడతారు. నేను మాత్రం వీకెండ్స్‌ కూడా వర్క్‌ చేయడానికి ఇష్టపడతాను. అందరికీ హీరోయిన్‌ అయ్యే చాన్స్‌ రాకపోవచ్చు. మనకి వచ్చిన చాన్స్‌ని కష్టపడి నిలబెట్టుకోవాలి. అందుకే నా జాబ్‌ను లక్కీగా ఫీల్‌ అవుతాను.

► ఏ కథ అంగీకరించినా అది నా నిర్ణయమే. ‘క్షణం’ ఓకే చేసినప్పుడు చిన్న సినిమా ఎందుకు? అన్నారు. కానీ నా నిర్ణయాలను ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది.

మరిన్ని వార్తలు