ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ

20 Nov, 2019 13:54 IST|Sakshi

ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్‌ పిక్చర్స్‌ పతారంపై ఆర్‌.కార్తికేయన్‌ జగదీశ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ.  రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్‌ సెంథిల్, తిథియన్‌ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్‌ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్‌.కరుణ, సాయిరాం  ముఖ్యపాత్రల్లో నటించారు. 

మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్‌ మెయ్యప్పన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్‌తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 

కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌ కోలీవుడ్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్‌ విక్రమ్‌ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్‌ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అర్జున్‌ రెడ్డి’  తమిళ రిమేక్‌గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా