మణిరత్నం హీరోయిన్‌కూ తప్పలేదు!

11 Oct, 2018 11:12 IST|Sakshi

తమిళసినిమా: మణిరత్నం హీరోయిన్‌కు అడ్జెస్ట్‌మెంట్‌ వేధింపులు తప్పలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. మణిరత్నం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి అధితిరావ్‌. ఇటీవల కూడా ఆయన దర్శకత్వంలో వహించిన సెక్క సివంద వానం చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం కల్పించారు. అలా గుర్తింపు తెచ్చుకున్న అధితిరావ్‌ తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి ఒక నూతన చిత్రంలో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది.  ఇటీవల కాస్టింగ్‌ కౌచ్, ఇప్పుడు మీటు సంఘటనలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ విషయంపై ఇప్పుడు చాలా మంది తమకు జరిగిన లైంగికవేధింపుల సంఘటనల గురించి బయట ప్రపంచానికి చెప్పుకుని ఇన్నాళ్లూ తమ గుండెల్లో రగులుతున్న బడబాగ్నులను చల్లబరచుకుంటున్నారు. అదే విధంగా నటి అధితిరావ్‌ కూడా దీనిపై స్పందించి తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో నేనూ మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది.  ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. వారసుల కంటే సినీ నేపథ్యం లేని వారిని అవకాశాల కోసం పడక గది వేధింపులకు అధికంగా గురవుతున్నారని నేను చెప్పలేను గానీ, నా గురించి మాత్రం చెప్పగలను. కొత్తగా ఈ రంగానికి వచ్చే వారు లక్ష్యం దిశగా ముందుకెళ్లడం కష్టమే. 

అయితే అది అసాధ్యం కాదు. అందుకు ఉదాహరణ నేనే. అడ్జెస్ట్‌ కానందుకు అవకాశాలు తగ్గుతాయి. అయినా నా విధానాలను మార్చుకోలేదు. మొదట్లో చెడు అనుభవం ఎదురైంది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయాను. గౌరవంగా జీవించాలన్నది లక్ష్యంగా జీవిస్తున్నాను. నాకు గౌరవ మర్యాదలే ముఖ్యం. అందుకు అవకాశాలు పోయినా పర్వాలేదు. అదే విధంగా మహిళలకు సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ సరైన భద్రత లేదు. అన్ని రంగాల్లోనూ విభిన్న వ్యక్తులు ఉంటారు. కొందరు మర్యాదగా నడుచుకుంటే, మరి కొందరు మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే.

 ఇకపోతే నేనెందుకు ఇంకా నంబర్‌ ఒన్‌ హీరోయిన్‌ను కాలేదని చాలా మంది అడుగుతున్నారు. అందుకు నా వద్ద సరైన సమాధానం లేదు గానీ, నాకు లభిస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను. నేను కొందరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించాను. దీంతో నంబర్‌వన్‌ నటిని కాలేకపోయానన్న బాధ ఏ కోశానా లేదు. కొందరు అధిక పారితోషాకం పొందడాన్ని విజయంగా భావిస్తారు. మరి కొందరు పలు అవార్డులను గెలుచుకోవడాన్ని సక్సెస్‌గా భావిస్తారు. ఇంకొందరు అధిక చిత్రాల్లో నటించడాన్ని విజయంగా భావిస్తారు. నేను మాత్రం ఒక పెద్ద దర్శకుడు నటించడానికి అవకాశం ఇస్తే గౌరవంగా భావిస్తాను. అదే నాకు విజయం అని అధితిరావ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు