అతన్ని అలా ఊహించుకోలేకపోయా

27 Jun, 2018 00:00 IST|Sakshi

రణ్‌బీర్‌కి సిస్టర్‌లా నటించాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరు. అదితీ శీయ కూడా చాలా కష్టంగా ఒప్పుకున్నారట. ‘సంజు’ బయోపిక్‌లో సంజయ్‌ దత్‌ సిస్టర్‌ ప్రియా దత్‌ పాత్ర చేశారు అదితీ శీయ. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందా? తెలుగులో పూరి జగన్నాథ్‌ తీసిన ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేశారు శీయ. బాలీవుడ్‌ బ్యూటీ చేస్తూ శియ గౌతమ్‌ నుంచి అదితి శీయగా పేరు మార్చుకున్నారు. ‘సంజు’ సినిమాలో యాక్ట్‌ చేయడం గురించి శీయ మాట్లాడుతూ – ‘‘రాజ్‌ కుమార్‌ హిరాణీ సినిమాలో యాక్ట్‌ చేసే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రైనా చేయొచ్చు. సంజయ్‌ దత్‌గారి సిస్టర్‌ ప్రియని నేనెప్పుడూ కలవలేదు. ఆవిడ ఇంటర్వ్యూలు చూసి మేనరిజమ్స్‌ నేర్చుకున్నాను. రణ్‌బీర్‌ కపూర్‌ సింగిల్‌ టేక్‌ యాక్టర్‌. అచ్చం సంజయ్‌ దత్‌లానే మారిపోయారు. అతనితో వర్క్‌ చేసిన తర్వాత నేను అతని ఫ్యాన్‌ అయిపోయాను. అయితే రణ్‌బీర్‌ని బ్రదర్‌గా ఊహించుకోలేకపోయా’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు