‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

15 Aug, 2019 08:15 IST|Sakshi

టైటిల్ : ఎవరు
జానర్ : ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌
తారాగణం : అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ
సంగీతం : శ్రీ చరణ్‌ పాకల
దర్శకత్వం : వెంకట్‌ రామ్‌జీ
నిర్మాత : పీవీపీ

క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్‌ మరోసారి సక్సెస్‌ సాధించాడా..?

కథ :
ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్‌ మహా భార్య, సమీరా మహా(రెజీనా), డీసీపీ అశోక్‌ (నవీన్‌ చంద్ర)ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే అశోక్‌, తమిళనాడు.. కూనుర్‌లోని ఓ రిసార్ట్‌లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్‌మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్‌ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది.

కేసు విషయంలో సమీరాకు సాయం చేసేందుకు అవినీతి పరుడైన పోలీసు అధికారి విక్రమ్‌ వాసుదేవ్‌(అడివి శేష్‌)ఆమెను కలుస్తాడు. తనకు అసలు నిజం చెపితేనే కేసు నుంచి కాపాడగలనని సమీరాకు చెపుతాడు విక్రమ్‌. మరి సమీరా, విక్రమ్‌తో అసలు నిజం చెప్పిందా..? అశోక్‌తో సమీరాకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసుకు, ఏడాది క్రితం కనిపించకుండా పోయిన వినయ్‌ వర్మ(మురళీ శర్మ)కు, అతని కొడుకు ఆదర్శ్‌కు సంబంధం ఏంటి..? అసలు విక్రమ్‌ వాసుదేవ్‌ ఎవరు? సమీరా ఎవరు? అన్నది తెర మీద చూడాల్సిందే.


నటీనటులు :
థ్రిల్లర్‌ కథాంశాల్లో నటించటం అడివి శేష్‌కు కొట్టిన పిండి. అందుకే విక్రమ్ వాసుదేవ్‌ పాత్రలో ఈజీగా నటించేశాడు శేష్‌. అనవసరమైన బిల్డప్‌లు భారీ ఎమోషన్స్‌, పంచ్‌ డైలాగ్‌లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజీనా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న రెజీనా ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించింది. సమీరాగా చాలా వేరియేషన్స్‌ చూపించే చాన్స్ దక్కింది. కీలక పాత్రల్లో నవీన్‌ చంద్ర, మురళీ శర్మ, నిహాల్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
 
విశ్లేషణ :
ఒక హత్య కేసు, ఓ మిస్సింగ్‌ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తయారు చేసుకున్న కథను తన కథనంతో రెప్పవేయకుండా చూసేంత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు దర్శకుడు వెంకట్‌ రామ్‌జీ. సినిమాలో పది, పదిహేను నిమిషాలకోసారి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు. దర్శకుడు థ్రిల్లర్ జానర్‌కే ఫిక్స్‌ అయి సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ పేరుతో కామెడీ, డ్యూయెట్స్‌ లాంటివి ఇరికించకపోవటం సినిమాకు కలిసొచ్చింది. రొటీన్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించటం కాస్త కష్టమే.

చాలా సన్నివేశాలు రెండు మూడు కోణాల్లో చూపించినా ఎక్కడ బోర్‌ అనిపించకుండా తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్‌ హాఫ్ అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకల సంగీతం. పాటలు కథలో భాగం వచ్చిపోతాయి. నేపథ్య సంగీతంతో ప్రతీ సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు.. సంగీత దర్శకుడు. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన సీరియస్‌నెస్‌ను తీసుకువచ్చాడు. సినిమా అంతా రెండు, మూడు లోకేషన్లలోనే తెరకెక్కించినా ఎక్కడా బోర్‌ ఫీలింగ్ కలగకుండా తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్‌ చేశాడు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్‌ నటన
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోవటం

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు