ఏ సినిమా ఎందుకు ఆడుతుందంటే...

27 Mar, 2014 00:09 IST|Sakshi
ఏ సినిమా ఎందుకు ఆడుతుందంటే...

ప్రతి శుక్రవారం ఏవో కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని విజయాలు, చాలా భాగం పరాజయాలు. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపవడం, అతి తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ కొన్ని హిట్టవడం సినీసీమలో సర్వసాధారణం. దాంతో, వారం వారం సినీ దర్శక, నిర్మాతలు, తారల జాతకాలు మారిపోతుంటాయి. నిజానికి, ఎవరూ ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు. అందరి లక్ష్యం - ప్రేక్షక జనాన్ని ఆకర్షించాలనే! బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించాలనే! కానీ, కొన్ని సినిమాలకే అది సాధ్యమవుతుంటుంది. అసలు ఈ సినీ విజయాలకు తోడ్పడిన అంశాలేమిటో, అపజయాలకు కారణాలేమిటో తెలిస్తే? అవన్నీ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే?
 సినిమా జయాపజయాలు అదృష్టాన్ని బట్టి ఉంటాయని అనుకుంటూ ఉంటారు.

కానీ, శాస్త్రీయ ఆధారాలు, విశ్లేషణ ఆధారంగా సక్సెస్ రేటును ముందే పసిగట్టవచ్చన్నది నిపుణుల వాదన. బాక్సాఫీస్ విజయ సూత్రం ఏమిటన్నది సశాస్త్రీయంగా కనిపెట్టాలనీ, ఆ ఫార్ములా ఆధారంగా వరుస విజయాలను సాధ్యం చేయాలనీ చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ మేనేజ్‌మెంట్ నిపుణుడు అరిందమ్ చౌధురి పదేళ్ళ క్రితం తన మేనేజ్‌మెంట్ సూత్రాలను బాలీవుడ్ చిత్ర నిర్మాణానికి తెచ్చారు. చిత్ర నిర్మాణానికి ముందే ప్రేక్షకుల సర్వేలు చేయడం లాంటి ప్రయత్నాలు చేశారు. వాటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఆయన తీసిన తొలి చిత్రం ‘రోక్ సకో తో రోక్ లో’ (2004) తీశారు. తీరా, ఆ చిత్రం ఫ్లాపైంది.

 అయితే, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు విశ్లేషణ పరికరాలు, పద్ధతులు చాలా మారాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఐ.బి.ఎం. సంస్థ ఆ టెక్నాలజీలను హిందీ చిత్ర పరిశ్రమకు తెచ్చింది. దర్శక, రచయితలు అప్పటికప్పుడు తమ మనసులో మెదిలిన ఆలోచనలను బట్టి సినిమాలకు విజయం సొంతమవుతుందని అనుకోవాల్సిన పని లేదంటోంది. అధ్యయనం ద్వారా సేకరించిన సమాచారాన్ని సృజనాత్మక ఆలోచనకు జతచేస్తే అప్పుడిక బాక్సాఫీస్ వద్ద విజయం సాధ్యమేనని ఐ.బి.ఎం. చెబుతోంది.
 
ఎలా చేశారీ విశ్లేషణ?

 ఫలానా స్క్రిప్టుతో తీస్తున్న సినిమా ఆడుతుందా, ఆడదా అన్నది తెలుసుకోవడానికి ఐ.బి.ఎం. చిత్రమైన పద్ధతులను అనుసరించింది. సామాజిక సంబంధాల సైట్లలో అమితమైన ఆసక్తి రేపుతున్న ఓ పాతిక దాకా హిందీ చిత్రాలను విశ్లేషణకు స్వీకరించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, రకరకాల బ్లాగులతో సహా పలు రకాల వేదికల ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలను సమీకరించింది. వాటి ద్వారా వచ్చిన దాదాపు 7 లక్షలకు పైగా పోస్ట్‌లను విశ్లేషించింది. అలా పరిశీలనకు ఎంచుకున్న చిత్రాల్లో ‘బర్ఫీ’, ‘ఏక్ థా టైగర్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘కై పోచే’, ‘కహానీ’, ‘అగ్నిపథ్’ లాంటి పేరున్న చిత్రాలున్నాయి. ఎంచుకున్న సినిమా ఏ కోవకు చెందినది, దాని కథాంశమేమిటి, నటీనటులు ఎవరు లాంటి రకరకాల అంశాల ఆధారంగా వాటి విజయాన్ని అంచనా వేయవచ్చని ఐ.బి.ఎం. విశ్లేషకులు చెప్పారు. ఈ అంచనా పద్ధతికి వారు పెట్టిన పేరు - ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ).


 ఫలించిన తొలి ప్రయత్నం?

 దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు నటించిన ‘(గోలియోం కీ రాస్‌లీలా...) రామ్‌లీలా’ చిత్రానికి ఈ ఎస్.ఎస్.ఐ. పద్ధతిని ఉపయోగించి చూసిన ఐ.బి.ఎం. నూటికి 73 పాళ్ళు ఆ సినిమా తొలివారం వసూళ్ళు బాగుంటాయని అంచనా వేసింది. ఆ ముందస్తు అంచనా నిజమైంది. తొలి వారం వసూళ్ళు బాగున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దాంతో, ఐ.బి.ఎం. చెప్పిన ఆ ఎస్.ఎస్.ఐ. మీద అందరి దృష్టీ పడింది.
 
 
 హిట్టవుతుందన్న నమ్మకమెంత?

 75 శాతం - ఐ.బి.ఎం. రూపొందించిన ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ)ని బట్టి, రాజకీయ వాసనలున్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద విజయావకాశాలు ఎక్కువని నూటికి 75 పాళ్ళ నమ్మకంతో చెబుతున్నారు.  
 69 శాతం - కామెడీ సినిమా హిట్టవుతుందని 69 పాళ్ళ మేర నమ్మకం. ఇలాంటి సినిమాల్లో పాటలు, డ్యాన్సులు, సంగీతం, పరభాషా చిత్రాల రీమేక్ కావడం లాంటివి కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
 63 శాతం - చక్కటి సంగీతం ఉండి, ఇతర భాషల్లో హిట్టయిన సినిమాకు రీమేక్ అయ్యుండి, సదరు రీమేక్‌కు ఎవరైనా స్టార్ డెరైక్టర్ దర్శకత్వం వహిస్తే, అలాంటి సినిమా హిట్టవుతుందని 63 పాళ్ళ మేర నమ్మకం ఉంటోంది.
 61 శాతం - యాక్షన్ సినిమా... దానికి ఓ స్టార్ డెరైక్టర్... ఈ రెండూ జత పడి, ఆ దర్శకుడే స్వయంగా నిర్మాణం కూడా చూసుకుంటే... ఇక కాసులు కురవడం ఖాయమని 61 శాతం మేర నమ్మకం వెల్లివిరుస్తోంది.
 62 శాతం - చిన్న బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే, భారీ బడ్జెట్ చిత్రాల విజయావకాశాలు ఎక్కువని 62 పాళ్ళు నమ్ముతున్నారు.