సాహసం శ్వాసగా...

30 May, 2015 23:18 IST|Sakshi
సాహసం శ్వాసగా...

నటులు చాలామంది ఉంటారు. కానీ, హీరోలు మాత్రం కొందరే ఉంటారు. హీరోగా చేయడం మానేసి, సినిమాలు చేయడం కూడా దాదాపుగా విరమించుకున్న ఒక నటుణ్ణి ఇవాళ్టికీ ‘సూపర్‌స్టార్’ అని ఎవరైనా పిలుస్తారా? అభిమానులే కాదు... ఆఖరికి పరిశ్రమ వర్గీయులు సైతం ఆయనను ఇప్పటికీ హీరో కృష్ణగానే ప్రస్తావిస్తారు. బహశా, అది ఒక్క ‘సూపర్‌స్టార్’ కృష్ణకే దక్కిన భాగ్యమేమో! ఇవాళ్టికీ హీరో కృష్ణ అంటే... ప్రాణం పెట్టే అభిమానులున్నారు. మహేశ్‌బాబులో తమ ఆరాధ్య కథానాయకుణ్ణి చూసుకొనే సినీప్రియులున్నారు. అందుకే, మే 31వ తేదీన ఆయన చెన్నైలో ఉన్నా, ఊటీలో విశ్రాంతి తీసుకుంటున్నా, హైదరాబాద్‌లో ఉన్నా... ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
 
 ఒక్కసారి వెనక్కి వెళితే... తెలుగు సినిమా రంగంలో తొలితరం నాగయ్య లాంటివాళ్ళ తరువాత స్టార్స్‌గా ఎదిగినవాళ్ళు - ఎన్టీఆర్, ఏయన్నార్. ఆ మహానటులు మంచి ఫామ్‌లో ఉండగానే వచ్చి, దీటుగా నిలబడి, స్టార్స్‌గా నిలదొక్కుకున్న నవతరం తారలనగానే కృష్ణ, శోభన్‌బాబులే గుర్తుకొస్తారు. ఇటు శోభన్‌బాబు తరంతోనూ, అటు నందమూరి జమానాతోనూ ఢీ అంటే ఢీ అన్న - సినీ సాహసిగా కృష్ణది ఒక చరిత్ర. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ కథలకు ‘గూఢచారి 116’ అయినా, ‘మోసగాళ్ళకు మోసగాడు’తో దేశవాళీ ‘మెకన్నాస్ గోల్డ్’ను అందించినా, ఎన్టీఆర్ చేద్దామనుకున్న అల్లూరి పాత్రను ధైర్యంగా తెరకెక్కించినా, తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’తో సంచలనం రేపినా - కృష్ణలోని ‘డేరింగ్ అండ్ డాషింగ్’ నేచరే కారణం.
 
 రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయ చిత్రాలు చేసినా, అభిమాన హీరో ఎన్టీఆర్‌నే ఢీ కొట్టినా - అనుకున్నది చేయడమే తప్ప, ఆ తరువాత ఏమవుతుందోనన్న వెరపు, వగపు ఆయనకు లేవు. ఆయన ధైర్యాన్ని ప్రేక్షకులు కూడా ఆశీర్వదించారు కాబట్టే, ‘అల్లూరి...’ లాంటివి ఆయన ఊహించినదాని కన్నా హిట్టయ్యాయి. తెలుగులో అత్యధిక (300 పైచిలుకు) చిత్రాల్లో హీరోగా నటించిన స్టార్‌కు తలమానికంగా మిగిలాయి.
 
 ‘‘వారసుడిగా మహేశ్ హీరో అయి, ‘రాజకుమారుడు’తో తొలి సక్సెస్ సాధించగానే సంతృప్తికి లోనయ్యా’’ అని పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళే ఈ ఏడుపదుల స్టార్‌కు హీరోగా ఇది స్వర్ణోత్సవ వత్సరం (‘తేనెమనసులు’ 1965). ‘‘చిన్నాచితకా పాత్రలు కాకుండా, స్థాయికి తగ్గ పాత్రలొస్తే చేస్తా’’నంటూ ఉత్సాహం చూపుతున్న కృష్ణకు ఇప్పుడు ఒకటే కోరిక... ‘‘నేను, మా అబ్బాయి మహేశ్, మనుమడు గౌతమ్ కలసి ఒక సినిమాలో చేయాలి’’. ఒకే కుటుంబంలోని మూడు తరాలూ కలసి నటించే కోరిక నెరవేరితే, అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా