కస్టడీ డెత్‌: వీడియో డెలిట్‌ చేసిన సింగర్‌!

11 Jul, 2020 08:29 IST|Sakshi

కస్టడీ డెత్‌: ఆ వీడియో డెలిట్‌ చేయండి

చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌ ఘటనకు సంబంధించిన వీడియోను తొలగించాలని తమిళనాడు క్రైంబ్రాంచ్‌ సీఐడీ(సీబీ-సీఐడీ) ప్రముఖ గాయని సుచిత్రకు విజ్ఞప్తి చేసింది. పోలీసుల కస్టడీలో చిత్ర హింసలకు గురై వారిద్దరు చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవ సంఘటనలకు ఆమె వ్యాఖ్యలకు ఏమాత్రం పొంతన లేదని కొట్టిపారేసింది. ఊహాజనిత కథనాలు జోడించి ఈ ఘటనను సంచలనంగా మార్చేందుకు సుచిత్ర ప్రయత్నించారని పేర్కొంది. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వెంటనే ఈ వీడియోను తీసివేయాలని ఆమెకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తూత్తుకుడి జిల్లా పోలీసులు ట్విటర్‌లో చేశారు. సీబీ-సీఐడీ విజ్ఞప్తి మేరకు సుచిత్ర తన నిరాధార కథనాలతో కూడిన వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.(రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు)

కాగా తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం పోలీసుల దాష్టీకానికి జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన వీరు పోలీస్‌ కస్టడీలో దారుణంగా మృతి చెందడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ విచారణలో కూడా వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది. ఇక ఈ ఘటనపై సినీ, క్రీడా ఇతర రంగాల సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక దక్షిణాది గాయని అయిన సుచిత్ర ఘటన జరిగిన వెంటనే స్పందించి తన సోషల్‌ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు.

అయితే అవన్నీ నిరాధార, కల్పిత కథనాలంటూ శుక్రవారం సీబీ-సీఐడీ ఆమెకు ఓ నోటీసు జారీ చేసింది. కస్టడీ డెత్‌ కేసు విచారణ జరుగుతున్నందున ప్రింట్‌, విజువల్‌, సోషల్‌ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. అదే విధంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను నమ్మవద్దని ప్రజలను కోరింది. కాగా జయరాజ్‌, బెనిక్స్‌ల కస్టడీ డెత్‌ కేసును మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం సీబీ-సీఐడీకి అప్పగించగా.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తండ్రీకొడుకుల మృతిపై విచారణ కొనసాగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా