అందరికీ ధన్యవాదాలు

27 Jul, 2016 02:32 IST|Sakshi
అందరికీ ధన్యవాదాలు

తమిళసినిమా; కబాలి చిత్రం అనితర సాధ్య వసూళ్లతో రికార్డులు బద్ధలుకొడుతోంది. ఈ విజయాన్ని ప్రపంచ సినిమా వేడుక చేసుకుంటోంది. ముఖ్యంగా రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గల్లాపెట్టెలు నిండుతున్నాయి. చిత్ర దర్శకుడు అభినందనల వానలో తడిచి ముద్దవుతున్నారు. కబాలి చిత్రంలో నటించిన తారాగణం, ఇతర సాంకేతిక వర్గం ఘనంగా ఫీలౌతున్నారు.
 
 ఇంతకీ కబాలి చిత్రాన్ని సింగిల్ హ్యాండ్‌తో విజయ తీరాన్ని దాటించిన సూపర్‌స్టార్ రజనీ మనసులోని మాట ఏమిటీ? కబాలి చిత్రంపై ఆయన స్పందన వినాలని పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కబాలి చిత్రాన్ని పూర్తి చేసి, తదుపరి ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 2.ఓ చిత్ర అమెరికా షెడ్యూల్‌ను పూర్తి చేసి అక్కడే ఉండిపోయారు. కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారని అందరూ భావించినా ఆయన రాలేదు. దీంతో రజనీకాంత్ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి.
 
 కబాలి విజయం సంతోషాన్నిచ్చింది:
 ఇక అసలు విషయానికొస్తే రెండు రోజుల క్రితం అమెరికా నుంచి చెన్నైకి తిరిగి వ చ్చిన సూపర్‌స్టార్ మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో నాకు జీవితాన్నిచ్చిన తమిళ ప్రజలందరికీ నమస్కారాలు. శంకర్ దర్శకత్వంలో లైకా పొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 2,ఓ. నా చిరకాల మిత్రుడు కలైపులి ధాను యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నిర్మించిన విప్లవాత్మక చిత్రాలకు సంబంధించి మలేషియా, ఇండియాలో షూటింగ్‌లో అవిశ్రాంతంగా నటించాను.
 
  దీంతో శారీరకంగానూ, మానసికంగానూ విశ్రాంతి అవసరం అయ్యింది. తన పెద్దకూతురు ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి అమెరికాలోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ, వైద్య చికిత్స పొంది రెండు నెలల తరువాత పూర్తి ఆరోగ్యంతో, నూతనోత్సాహంతో చెన్నైకి తిరిగొచ్చాను. కాగా కబాలి చిత్ర సంచలన విజయ వార్తలను అమెరికాలోనే విన్న నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం సంతోషంగా ఉంది. ఇంత ఘన విజయానికి కారణం అయిన సహ నటీనటులు, అభిమానులకు, సగటు ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా చిత్ర నిర్మాత ధాను, దర్శకుడు రంజిత్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అని రజనీకాంత్ పేర్కొన్నారు.
 
 కబాలి ఫ్లాప్ అన్న వైరముత్తు:
 కాగా కబాలి చిత్ర అపజయాన్ని అంగీకరించాలన్న ప్రముఖ గీత రచయిత వైరముత్తు వ్యాఖ్యానించడంపై రజనీకాంత్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న వైరముత్తు కబాలి చిత్ర అపజయాన్ని అంగీకరించాలని నోరు జారారు. అయతే ఆయన ఈ చిత్రానికి ఒక్క పాట కూడా రాయలేదు. అదే విధంగా ఆయన మిత్రుడు ఏఆర్.రెహ్మాన్ కాకుండా సంతోష్ నారాయణన్ కబాలి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇవన్నీ మనసులో పెట్టుకునే వైరముత్తు కబాలి చిత్రం అపజయం అని పేర్కొన్నారని రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 నోరు జారింది:
 కాగా కబాలి చిత్రంపై వైరముత్తు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడంతో ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. మంగళవారం వైరముత్తు ఒక ప్రకటన విడుదల చేస్తూ కబాలి చిత్ర జయాపజయాలను జీర్ణించుకోవాలన్న ఉద్దేశంతోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని, అయితే పొరపాటున విజయం అనే పదాన్ని వాడలేదని, ఇదే విషయాన్ని తాను రజినీ చెన్నైకి తిరిగొచ్చిన మరుసటి రోజే ఫోన్ చేసి వివరించానని అన్నారు. తన మాటలను అర్థం చేసుకున్న రజనీకాంత్ ఇతరులు కొం దరు ఇదే విధంగా చెప్పారని అన్నారన్నారు. కాబట్టి తన వ్యాఖ్యల్ని భూతద్దంలో చూడొద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 

>