ధోనీపై సినిమా ఖాయం!

25 Sep, 2014 23:11 IST|Sakshi
ధోనీపై సినిమా ఖాయం!

 క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు తీయడమనేది బాలీవుడ్‌లో లేటెస్ట్ ట్రెండ్. గత ఏడాది మిల్కా సింగ్ జీవితంతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’, ఈ ఏడాది మేరీ కోమ్ జీవితంతో వచ్చిన ‘మేరీ కోమ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా, టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోని’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్‌ని ధోని భార్య సాక్షీ సింగ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అయితే, కొన్ని రోజుల క్రితం ధోనీ జీవితంతో సినిమా రూపొందనుందనే వార్త రాగానే, ‘బీసీసీఐ’ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్త వచ్చింది.
 
 అంతర్జాతీయ క్రికెట్‌లో దోనీ ఇంకా ఆడుతున్నందున ఇప్పుడు సినిమా తీయడం సరికాదని, ఆయన రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమా తీయాలని బీసీసీఐ చెప్పినట్లు ఓ వార్త హల్‌చల్ చేసింది. దాంతో ధోనీపై చిత్రం ఉండదని ఎవరికి వారు అనుకుంటున్న తరుణంలో, హఠాత్తుగా సాక్షీ సింగ్ ఈ చిత్రం పోస్టర్‌ను బయటపెట్టడంతోపాటు, ‘గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. మీ కోసమే ఈ పోస్టర్’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నందుకుగాను హక్కుల నిమిత్తం ధోని 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు.