మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి

24 May, 2014 00:30 IST|Sakshi
మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి

 అవకాశాల వెంట పరిగెట్టడం ఒక రకం అయితే అవకాశాలను వెతుక్కుంటూ పరుగులు తీయడం మరో రకం. ఇక కళాకారులకు భాషా భేదం ఉండదు. ముఖ్యంగా హీరోయిన్లు ఏ భాషలో మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఏ భాషా చిత్రాల్లో చూసినా పరభాషా కథానాయికల శాతమే అధికంగా ఉంటుంది.

ఇక  అంజలి విషయానికొస్తే ఈ తెలుగమ్మాయి టాలీవుడ్‌లో తొలుత హీరోయిన్‌గా ఎదగాలని ఆశించింది. అరుుతే అంజలి తొలి ప్రతిభకు మొదట్లో టాలీవుడ్ గుర్తించలేదు. దీంతో కోలీవుడ్ పై కన్నేసింది. ఇక్కడ తొలి చిత్రం కట్రదు తమిళ్ నటిగా ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే నటిగా ఎదగడానికి కాస్త సమయం పట్టింది. అంగాడి తెరు చిత్రం అంజలి ప్రతిభకు పట్టం గట్టింది.
 
 ఆ తరువాత ఎంగేయుమ్ ఎప్పుదుమ్, కలగలప్పు వంటి చిత్రాలు ఆమెకంటూ ఒక స్థాయిని ఏర్పరచాయి. సరిగ్గా అలాంటి పరిస్థితిలో అంజలి సమస్యల వలయంలోకి వెళ్లిపోయింది. అనూహ్యంగా పినతల్లితో మనస్పర్థలు, ఆమెపై వ్యతిరేకత అంజలిని కోలీవుడ్‌కు దూరం చేశాయి. అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లి పినతల్లిపై ఆరోపణలు గుప్పించి కలకలం సృష్టించింది.

అదే సమయంలో తెలుగులో వెంకటేష్ వంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఇక అక్కడ తన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని భావించింది. దీంతో కోలీవుడ్‌ను పక్కన పెట్టేసింది. అయితే టాలీవుడ్‌లో రెండు మూడు చిత్రాలు వచ్చినా ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. ఇక చేసేది లేక ఈ అమ్మడిప్పుడు మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది.
 
 తెలుగు చిత్రాల్లో నటిస్తున్నందువలన తమిళంలో కొంచెం గ్యాప్ వచ్చిందని నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న అంజలి మళ్లీ తమిళ చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నానంది.  తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని దాన్ని పదిలపరచుకోవడానికి మరిన్ని మంచి కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇకపోతే గ్లామరస్ పాత్రలు పోషించడానికి రెడీనా? అని అడుగుతున్నారని గ్లామరనేది సినిమాలో ఒక భాగమైనందువల్ల అందుకు తన కెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి పాత్రలను ఆశిస్తున్నట్లు అంజలి పేర్కొంది.