మళ్లీ డెరైక్షన్ చేస్తున్నా...

25 Jul, 2014 00:53 IST|Sakshi
మళ్లీ డెరైక్షన్ చేస్తున్నా...

 ‘‘బ్రెయిన్‌కి కనెక్టయిన సినిమా హిట్ టాక్‌కే పరిమితం అవుతుంది. హార్ట్‌కి కనెక్టయిన సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ‘దృశ్యం’ రెండో కోవకు చెందిన సినిమా’’ అని  రచయిత ‘డార్లింగ్’స్వామి అన్నారు. తాను సంభాషణలు సమకూర్చిన ‘దృశ్యం’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం పట్ల స్వామి ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘మాది తాడేపల్లిగూడెం. అక్కడే డిగ్రీ చదివాను. వైజాగ్‌లో ఎం.ఎ.లిటరేచర్ చేశాను.
 
  సినిమా అంటే పేషన్, రచనపై ఆసక్తి... నన్ను హైదరాబాద్ వైపు నడిపించాయి. కోన వెంకట్‌గారి వద్ద సహాయకునిగా చేరాను. ‘ఒక ఊరిలో’ నేను మాటలు రాసిన తొలి సినిమా. హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, రెబల్ రచయితగా నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు’’ అని చెప్పారు స్వామి. ‘రొమాన్స్’ చిత్రంతో దర్శకునిగా కూడా మారిన తాను, త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.