బిగ్‌బాస్‌: మళ్లీ కౌశల్‌ Vs నందినీ

1 Aug, 2018 09:02 IST|Sakshi
కౌశల్‌తో నందిని వాగ్వాదం

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన రియాల్టీ షో. హౌస్‌లో గత వారం జరిగిన పరిణామాలతో ఈ షోపై  ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వారి ఆసక్తిని అందుకోవడంలో బిగ్‌బాస్‌ టీం దారుణంగా విఫలమవుతోంది. ఎన్నో అంచనాలతో టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. మంగళవారం ఎపిసోడ్‌ పూర్తిగా నిరాశజనకంగా సాగింది. ఒక టాస్క్‌ను రెండు సార్లు చేయించడం బిగ్‌బాస్‌ వైఫల్యానికి నిదర్శనం.

హౌస్‌ మేట్స్‌కు పైరేట్స్‌ Vs సర్వైవర్స్‌ .. అనే ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించిన బిగ్‌బాస్‌ ఒక జట్టు సర్వైవర్స్‌గా.. మరో జట్టు పైరేట్స్‌గా వ్యవహరించాలని సూచించాడు. సర్వైవర్స్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చెక్కబల్లలపై ఉండాలని, వారిని పైరేట్స్‌ కిందికి దింపాలని ఆదేశించాడు. సర్వైవర్స్‌ ఒక్కసారి బల్లను ఎక్కితే ఏ అవసరానికి దిగవద్దని తెలిపాడు. ఇలా ఇరుజట్లు తమ రోల్స్‌ మార్చుకోవాలని, ఏ జట్టు తక్కువ సమయంలో దింపుతారో ఆ జట్టు ఈ టాస్క్‌ విజేత అని పేర్కొన్నాడు. అయితే తొలుత సర్వైర్స్‌గా గీతామాధురి, దీప్తి సునయన, రోల్‌రైడా, పూజా రామచంద్రన్‌, దీప్తి, సామ్రాట్‌లుండగా.. పైరేట్స్‌గా కౌశల్‌, నందనీ, తనీష్‌, బాబుగోగినేని, గణేశ్‌, అమిత్‌లున్నారు. తొలుత పైరేట్స్‌ ఆమాంతం చెక్కబల్లలను ఎత్తి సర్వైర్స్‌ను కిందికి దింపేశారు. ఈ సమయంలో నందినీ, కౌశల్‌.. దీప్తి బల్లను ఎత్తే ప్రయత్నంలో ఆమె కాలు నలిగిపోయింది.. ఆ బాధను తట్టుకోలేక దీప్తి ఏడ్చేసింది. దీంతో కౌశల్‌-నందినీల మధ్య గొడవ జరిగింది. నీవల్లనే అంటే నీవల్లే అనే ఒకరిని ఒకరు దూషించుకున్నారు.

అనంతరం బిగ్‌బాస్‌ బల్లలను ఎత్తి వేయవద్దని, టాస్క్‌ మళ్లీ కొనసాగించాలని తనీష్‌కు సూచించాడు. మళ్లీ ప్రారంభమైన టాస్క్‌ తాళ్లతో, ఆయిల్స్‌ సాయంతో సర్వైర్స్‌ను పైరేట్స్‌ దింపేశారు. ఈ టాస్క్‌లో పూజా రామచంద్రన్‌ ఆకట్టుకుంది. పైరేట్స్‌ సహనానికే పరీక్షగా నిలిచింది. ఎదోలా తాళ్ల సాయంతో ఆమెను కష్టంగా దించేశారు. అయితే ఈ టాస్క్‌ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. చాలా బోరింగ్‌గా ఉందని ఇవేమి టాస్క్‌లంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌పై మండి పడుతున్నారు.

కౌశల్‌పై టిష్యూ..
టాస్క్‌ పూర్తి అయిన అనంతరం దీప్తికి మరోసారి క్షమాపణలు చెప్పింది నందినీ. అంతా నీవల్లే జరిగిందంటూ.. పక్కనే ఉన్న కౌశల్‌ను నిందిస్తూ టిష్యూ పేపర్‌ విసిరేసింది. దీనికి కౌశల్‌ గట్టిగానే బదులిచ్చాడు. ‘నేను నీలా చేస్తే తట్టుకోలేవని’ వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే జోవియల్‌గా చేసిన పని అని బాధపెట్టాలని కాదని నందినీ చెప్పింది.దీంతో ఆ గొడవ అక్కడితో ముగిసింది. అయితే నందినీ ఈ పని జోవియల్‌గా చేసినట్లు అనిపించలేదు. గతంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

బెస్ట్‌ ఫొటో తనీష్‌.. రీక్రియేషన్‌ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌ ఫొటోలను బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌కు మరోసారి చూపించాడు. ఈ టాస్క్‌లో తనీష్‌ది బెస్ట్‌ పిక్‌గా ఎంపికచేసి కేకును పంపించాడు. కంటెస్టెంట్స్‌ అంతా సరదాగా నవ్వుకుంటూ కేకును ఆస్వాదించారు. ఇక టాస్క్‌లో రోల్స్‌ మార్చుకోనున్న కంటెస్టెంట్స్‌.. తమ వ్యూహాలను అప్పుడే మొదలు పెట్టారు. కొబ్బరి నూనే, తాళ్లు దొరక్కుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఎలిమినేటై ప్రేక్షకుల మద్దతుతో మరో అవకాశం దక్కించుకున్న నూతన్‌ నాయుడు, శ్యామలను ఇంకా హౌస్‌లోకి పంపివ్వలేదు. ఇది కూడా ప్రేక్షకులకు బిగ్‌బాస్‌పై ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం ఈ రోజైనా వారు హౌస్‌లోకి వస్తారో లేదో చూడాలి మరి!

చదవండి: బిగ్‌బాస్‌: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు